Begin typing your search above and press return to search.

ఏపీ బడ్జెట్ ఎంత...పయ్యావుల కసరత్తు

అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం పెట్టాల్సి ఉంది. దాని కోసం ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 9:44 AM GMT
ఏపీ బడ్జెట్ ఎంత...పయ్యావుల కసరత్తు
X

కేంద్ర ప్రభుత్వం తాజాగా 50 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ని 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టింది. ఇపుడు ఏపీ వంతుగా ఉంది. ఏపీలో కూడా కొత్త ఆర్ధిక సంవత్సరం కోసం బడ్జెట్ ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాల్సి ఉంది. గత ఏడాది జూన్ 12న అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ ఏడాది చివరిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది.

అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం పెట్టాల్సి ఉంది. దాని కోసం ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ మధ్యనే ఢిల్లీలో 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా పయ్యావుల కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించారు.

ఏపీ ఆర్ధికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి పనగారియా బృందానికి చంద్రబాబునాయుడు వివరణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు వీలుగా నిధులను ఉదారంగా కేటాయించాలని ఆయన కోరారు.

మరో వైపు చూస్తే కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి వివిధ రంగాల ద్వారా ఏ మేరకు ఎంతెంత నిధులు వస్తాయన్నది కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఇవన్నీ కలుపుకుని ఏపీ బడ్జెట్ ని రూపొందించే పనిలో పయ్యావుల ఉన్నారు.

ఈసారి బడ్జెట్ లో సంక్షేమ పధకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అవుతున్నందువల్ల ప్రజల ఆశలు కూడా అంతే స్థాయిలో ఉన్నందున బడ్జెట్ లో పధకాలకు నిధులు ఇవ్వడం అన్నది తప్పనిసరి అవుతోంది.

వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పధకం అలాగే మరికొన్ని పధకాలను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు. గత ఏడాదిన ప్రారంభించిన ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకం కింద ఈసారి మూడూ ఇవ్వాల్సి ఉంటుంది. దాని కోసం మూడు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుందని లెక్క వేస్తున్నారు.

అలాగే అన్నదాతా సుఖీభవ పధకం కూడా అమలులోకి తేవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఏపెలెఓ మొత్తం 57 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరికీ ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులోనే కేంద్రం అందించే కిసాన్ యోజన పధకం నిధులను కూడా రైతులకు ఈ పధకం ద్వారా న్యాయం చేయాలనుకుంటోంది. దీనికి కూడా బడ్జెట్ లో అధిక నిధులు అవసరం అవుతాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో భారీగా నిధులను కేటాయించేందుకు చూస్తున్నారు. సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం తగ్గేది లేదని చాటి చెప్పడం జరుగుతుందని అంటున్నారు. అభివృద్ధికి కూడా పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. దాంతో కూటమి ప్రభుత్వం ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ జిల్లాలలో అభివృద్ధి పనులకు కేంద్రం అందించే పధకాలకు మ్యాచింగ్ గ్రాంట్స్ ని ఇచ్చే విషయంలోనూ నిధులను బడ్జెట్ లో చూపించాల్సి ఉంది.

మొత్తానికి చూస్తే ఏపీ బడ్జెట్ ఎంత అన్నది ఆసక్తిని పెంచుతోంది. మూడు లక్షల కోట్ల పై మాటగా ఏపీ బడ్జెట్ ఉండవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను కోరిన ఆర్ధిక శాఖ బడ్జెట్ ని రూపొందించే పనిలో బిజీగా ఉంది. పయ్యావులకు మాత్రం ఈసారి బడ్జెట్ కత్తి మీద సాముగానే ఉండొచ్చు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేస్తారు అని అంటున్నారు. ఈ నెల 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ప్రచారంలో ఉంది.