Begin typing your search above and press return to search.

జగన్ ని తిరుమలకు రానిస్తారా ?

ఎవరికి తోచిన తీరులో వారు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్న వారే.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:30 AM GMT
జగన్ ని తిరుమలకు రానిస్తారా ?
X

ఏపీలో ఇపుడు అతి పెద్ద వివాదంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం లో కల్తీ జరిగింది అన్నది మారింది. దీని మీద గత పది రోజులుగా అగ్గి రాజుకుంటూనే ఉంది. దానికి పరిష్కారం అయితే లేదు. ఎవరికి తోచిన తీరులో వారు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్న వారే. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలలో ప్రత్యేక పూజలకు ఇచ్చిన పిలుపు అదే విధంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ శ్రీవారి ఆలయానికి కాలి నడకన రావడానికి నిర్ణయించుకున్న నేపధ్యంలో ఆ రోజు ఏమి జరగనుంది అన్న ఉత్కంఠ అయితే సర్వత్రా ఉంది.

సామాజిక మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం ప్రకటించగానే మంత్రి పయ్యావుల కేశవ్ మీరు తిరుమలకు రానవసరం లేదని మీడియా ముఖ్యంగా ప్రకటించేశారు. మీరు అయిదేళ్ళుగా చేసిన నిర్వాకం చాలు అని కూడా అన్నారు. జగన్ నాయకత్వంలోని గత ప్రభుత్వం తిరుమలలో చేసిన తీరు వల్లనే ఇంతలా పరిస్థితి వచ్చిందని కూడా అన్నారు.

ఇక్కడ పయ్యావుల కేశవ్ మాటలు చూస్తే జగన్ తిరుమలకు రావద్దు అన్న సందేశం తో పాటు తిరుమల వ్యవహారాల మీద వైసీపీ మాట్లాడే నైతిక అర్హత లేదు అనంది కూడా ఉంది. ఒక విధంగా వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఎవరికి వారు పై చేయి సాధించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.

ఈ క్రమంలో జగన్ తిరుమలకు కాలి నడకన రావాలని అనుకోవడం ఆ పార్టీ ఆలోచన. ఆయన ఆ విధంగా చేసి శ్రీవారిని దర్శించుకుని తమ పార్టీ తప్పు ఈ విషయంలో లేదని చెప్పడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ తీరుకు వారు శ్రీవారి లడ్డూని అపవిత్రం చేశారు అన్న దానికి ప్రాయశ్చిత్తంగా చేస్తున్న కార్యక్రమంగా ఉంది.

అంటే జగన్ ప్రోగ్రాం సక్సెస్ అయితే అది కూటమి మీద బండ వేసినట్లే అవుతుంది. దాంతో ఆయన తిరుమల రాకను కచ్చితంగా అడ్డుకోవడానికి టీడీపీ అయితే చూస్తుంది అని అంటున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీగా కాకుండా హిందూ సంఘాల ఆందోళన లేక లోకల్ గా భక్తుల ఆందోళన అన్న దానిని చూపించి జగన్ తిరుమల రాకను అడ్డుకుంటారా అన్న చర్చ అయితే వస్తోంది.

జగన్ మాజీ సీఎం అయ్యాక తిరుమలకు రావాలనుకోఅవ్డం ఇదే మొదటిసారి. అదే సమయంలో ఈ వివాదం కనుక రాకపోయి ఉంటే ఆయన వచ్చి ఉండేవారు కాదేమో. మరో వైపు చూస్తే ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో స్వామి సన్నిధిలో విరమించుకోవడానికి పవన్ నిర్ణయించుకున్నారు. ఆయన అక్టోబర్ 2న తిరుమలకు వస్తున్నారు.

అలాగే బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి అంటే అక్టోబర్ 3న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వస్తున్నారు. ఆ ఇద్దరి కంటే ముందే జగన్ రావడం అంటే ఒక విధంగా కూటమికి నేతలకు ఇష్టం ఉండదనే అంటున్నారు. మరి జగన్ రాకను అడ్డుకుంటారా దానికి ఉన్న అవకాశాలు ఏంటి అంటే హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ సర్కార్ దెబ్బ తీసింది అని చెబుతూ స్థానికంగా ఆందోళలు జరుగుతున్న దానిని చూపించి ఇప్పటి ఉద్రిక్తతల నడుమ వెళ్లడానికి వీలు లేదు అని కూడా అనవచ్చు అని అంటున్నారు.

ఇక చూస్తే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుమలలోని అఖండం వద్ద సత్య ప్రమాణం చేస్తూండగానే పోలీసులుని ఆయన్ని అక్కడ నుంచి నెట్టి పోలీసు జీపులలోకి ఎక్కించారు. ఉద్రిక్తతలు లా అండ్ ఆర్డర్ వంటి కారణాలు చూపిస్తే కనుక జగన్ ని తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి అన్న చర్చ కూడా మొదలైంది

ఏది ఏమైనా జగన్ తిరుమలకు రావడం అన్నది ఆ పార్టీకి సంబంధించి సత్య సంధతను నిరూపించుకునే కార్యక్రమం. ఒక విధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఇది ఒక ఊరటను ఇచ్చే కార్యక్రమం. మరి దానిని సాఫీగా సవ్యంగా జరగనిస్తారా అన్నదే చూడాలి. ఒక వేళ అలా అడ్డుకుంటే జగన్ అండ్ కో ఏమి చేస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా ఈ నెల 28న మాత్రం ఏపీ ఫుల్ ఫోకస్ తిరుమల మీదనే ఉండొచ్చు అన్నది అంతా అంటున్న మాట.