జగన్‌ను ఏకేస్తున్నారుగా!
సభలో సంఖ్యాబలంతో సంబంధం లేదని.. ఎంత మంది ఉన్నా.. ప్రతిపక్ష హోదా కట్టబెట్టొచ్చని సూత్రీకరించారు.
By: Tupaki Desk | 26 Jun 2024 10:05 AM GMTఒకటి అని నాలుగు అనిపించుకుంటున్నట్టుగా ఉంది ఏపీ మాజీ సీఎం జగన్ పరిస్థితి. ముఖ్యంగా అధికా రం కోల్పోయిన తర్వాత కూడా.. ఆయనలో మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. దీంతో ముందు వెనుక కూడా.. ఆయనను నాయకులు ఏకేస్తున్నారు. అసెంబ్లీలో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టాలం టూ.. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖరాసిన విషయం తెలిసిందే. సభలో సంఖ్యాబలంతో సంబంధం లేదని.. ఎంత మంది ఉన్నా.. ప్రతిపక్ష హోదా కట్టబెట్టొచ్చని సూత్రీకరించారు.
అంతేకాదు.. ఇలాంటి రూల్స్ కూడా లేవన్నారు. అయితే.. జగన్ రాసిన లేఖపై అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారనేది పక్కన పెడితే.. అధికార పార్టీ నుంచి మాత్రం మాటల పరంపరం.. విమర్శల తూటాలు పేలుతున్నాయి. గతం మరిచి జగన్ మాట్లాడుతున్నారంటూ.. సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా నిప్పులు చెరిగారు. రూల్స్ ఉన్నాయో.. లేవో చూసుకోమంటూ హితవు పలికారు. తాము కాదు.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలేనని చెప్పుకొచ్చారు.
గెలిస్తే.. ఒకవిధంగా ఓడితే మరో విధంగా జగన్ వ్యవహరిస్తున్నారంటూ పయ్యావుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984, 1994లలో కూడా.. ఇలాంటి పరిస్థితి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే అప్పట్లోనూ ఎవరూ ఏ పార్టీకీ ప్రదాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం జగన్ ఒక్క పార్టీకి సభలో ఫ్లోర్ లీడర్ మాత్రమేనని చెప్పారు. ఆయనకు హోదా లేదు.. రాదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకార సమయంలోనూ.. పద్ధతి ప్రకారమే వ్యవహరించామన్నారు.
ప్రతిపక్ష హోదా లేనందుకే.. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత.. జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించామన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల ఓ కీలక విషయం చెప్పారు. ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని.. జగనే గౌరవించడం లేదని అన్నారు. అంటే.. పయ్యావుల ఉద్దేశలో జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. వారి తీర్పును తాము ఎలా ఉల్లంఘిస్తామని ఆయన ప్రశ్నించినట్టయింది.