Begin typing your search above and press return to search.

హైకోర్టుకు ఏం చెబుతారు? జ‌గ‌న్‌కు హోదా ఓ చిక్కుముడే!

తాజాగా ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ఇదే వ్యాఖ్య‌లు చేశారు. 'జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కోసం.. హైకోర్టుకు వెళ్లారు.

By:  Tupaki Desk   |   27 July 2024 6:47 AM GMT
హైకోర్టుకు ఏం చెబుతారు?  జ‌గ‌న్‌కు హోదా ఓ చిక్కుముడే!
X

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌లేదు. అయితే.. త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల్సిందేన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ట్టుబ‌డుతున్నారు. దీనికి సంబంధించి స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుకు ఆయ‌న లేఖ రాసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేర‌కు ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. 'మీరైనా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇప్పించండి' అని కోర్టును అభ్య‌ర్థించారు. ఇంత వ‌ర‌కు ఓకే!

కానీ, ఇప్పుడు అస‌లు చిక్కులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం వైపు నుంచి కూడా.. జ‌గ‌న్ న్యాయ పోరాటాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ఇదే వ్యాఖ్య‌లు చేశారు. 'జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కోసం.. హైకోర్టుకు వెళ్లారు. బాగానే ఉంది. కానీ, ఆయ‌న అస‌లు స‌భ‌కు ఎన్ని రోజులు వచ్చారు? ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క‌పోతే స‌భ‌కు రాకూడ‌ద‌ని ఏమైనా ఉందా.. మేం కూడా.. ఆదిశ‌గానే చ‌ర్య‌లు చేప‌డుతున్నాం'' అని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అంటే.. ప్ర‌భుత్వం ఈ దిశగానే త‌న వాద‌న‌లు రెడీ చేసుకుంటోంది.

అస‌లు స‌భ ఎన్ని రోజులు జ‌రిగింది?

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని నూత‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. జూన్‌లో ఒక‌సారి మూడు రోజులు స‌భ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో రెండు రోజులు స‌భ్యుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ స‌మ‌యంలో తొలి రోజు స‌భ‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌, స‌హా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది వ‌చ్చారు. ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం.. జ‌రిగిన రెండు రోజుల స‌భ‌కు జ‌గ‌న్ రాకుండా.. ఆ వెంట‌నే పులివెందుల‌కు వెళ్లిపోయారు. నిజానికి మూడోరోజు స్పీక‌ర్ ఎన్నిక జ‌రిగింది. అయినా.. జ‌గ‌న్ రాలేదు. దీనిపై పెను దుమార‌మే రేగినా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు.

ఇక‌, ఇప్పుడు ఐదు రోజులు స‌భ‌లు జ‌రిగాయి. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు జ‌రిగిన బ‌డ్జెట్ స‌భ‌ల్లోనూ జ‌గ‌న్ ఆయ‌న ఎమ్మెల్యేలు మొత్తం తొలి రోజు సోమవారం ఒక్క‌రోజే స‌భ‌కు వ‌చ్చారు. గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగానికి హాజ‌ర‌య్యారు. 16 నిమిషాలు ఉన్నారు. నిర‌స‌న వ్య‌క్తం చేసి.. వెళ్లిపోయారు. అనంత‌రం ఢిల్లీలో ప్ర‌త్య‌క్ష మ‌య్యారు. త‌ర్వాత‌.. స‌భ‌ను ప‌ట్టించుకోలేదు. స‌భ‌ల చివ‌రి రోజు శుక్ర‌వారం కూడా.. తాడేప‌ల్లిలోనే ఉన్నా.. మీడియా మీటింగుల‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు.. త‌ప్ప‌. స‌భ‌కురాలేదు.

హైకోర్టు అడిగితే..

రేపు కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఇదే విష‌యాన్ని హైకోర్టు ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. స‌భ ఎన్ని రోజులు జ‌రిగింది? మీరు ఎన్ని రోజులు హాజ‌రయ్యారు? మీకు ఎన్ని సార్లు మైకు ఇచ్చారు? మీరు ఎన్నిసార్లు మైకు వినియోగించుకున్నార‌ని.. ప్ర‌శ్నిస్తే.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర స‌మాధానం చెప్పేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. ఇదే విష‌యాన్ని ప‌య్యావుల న‌ర్మ‌గ‌ర్భంగా ప్ర‌శ్నించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.