Begin typing your search above and press return to search.

రావాలి జగన్ అంటున్న టీడీపీ మంత్రి

రావాలి జగన్ కావాలి జగన్ అన్నది 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చిన పవర్ ఫుల్ స్లోగన్

By:  Tupaki Desk   |   15 Jun 2024 2:45 AM GMT
రావాలి జగన్ అంటున్న టీడీపీ మంత్రి
X

రావాలి జగన్ కావాలి జగన్ అన్నది 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చిన పవర్ ఫుల్ స్లోగన్. ఒక విధంగా నాడు ఏపీని ఊపేసిన స్లోగన్. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ ఓటమి పాలు అయింది. మొత్తం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అసెంబ్లీలో చూస్తే ప్రతిపక్ష హోదాకు కూడా చాన్స్ లేకుండా పోయింది.

ఈ నేపధ్యంలో ఈ నెల 19 నుంచి మొదలు కాబోతున్న శాసనసభ సమావేశాలకు జగన్ వస్తారా రారా అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. దీని మీద రాష్ట్ర ఆర్ధిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని ఆయన అంటున్నారు. శాసనసభకు జగన్ వచ్చి అర్ధవంతమైన చర్చ చేయాలని ఆయన అన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు విపక్షం ఇస్తే ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని అన్నారు. ప్రతిపక్షం ఆ విధంగా వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.

అంటే జగన్ రావాలని టీడీపీ కోరుకుంటోంది. అదే విధంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విధంగా అంటున్నారు. ఎన్ని సీట్లు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు ప్రతిపక్షంలో ఒక్కరు ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన అంటున్నారు. ప్రజలు ప్రతిపక్షం నుంచి ఆశిస్తారు అని ఆయన అంటున్నారు.

ఏదైనా చర్చించాలంటే చట్ట సభలకు మించినది లేదని ఉండవల్లి చెబుతున్నారు. 2014 నుంచి 2024 మధ్యలో శాసనసభలో అర్ధవంతమైన చర్చలు ఎక్కడా జరగలేదు అని ఉండవల్లి గుర్తు చేస్తున్నారు. 2014లో తొలి మూడేళ్ళు సభకు వెళ్ళిన జగన్ ఆ తరువాత బాయ్ కాట్ చేశారని, ఇక చంద్రబాబు 2019 నుంచి 2021 వరకూ వెళ్ళి సభకు నమస్కారం పెట్టారని ఆయన గుర్తు చేశారు.

ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా సభ సజావుగా సాగాలని జగన్ తనకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ప్రజల పక్షాన పోరాడాలని ఆయన కోరారు. అయితే జగన్ ఆలోచనలు ఏమిటి అన్నది తెలియడం లేదు. కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు బహు తక్కువ అని అంటున్నారు. తాను సభకు రాకుండా మిగిలిన పది మందినీ అసెంబ్లీకి పంపించి జగన్ జనంలోకే వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ రావాలని టీడీపీ సహా ఏపీలోని ప్రజానీకం కూడా బలంగానే కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.