పయ్యావుల ...ఆర్ధిక మంత్రిగా ఆశ తీరలేదా ?
ఉమ్మడి అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్.
By: Tupaki Desk | 29 July 2024 2:30 AM GMTఉమ్మడి అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. ఆయన 1994లోనే తొలిసారి ఎమెల్యే అయ్యారు. ఆయనది రాజకీయంగా మూడు దశాబ్దాల పయనం. కానీ మంత్రి పదవి ఆయన రాజకీయ జీవితంతో దోబూచులాడింది. 1995 నుంచి 2004 దాకా టీడీపీ అధికారంలో ఉన్నా అలాగే 2014 నుంచి 2019 దాకా మళ్లీ టీడీపీ గెలిచినా ఆయన మంత్రి కాలేకపోయారు. దానికి కారణం పార్టీ గెలిచినపుడు ఆయన ఓడిపోతూ వచ్చారు.
అలా 2019లో ఆయన గెలిచి వస్తే పార్టీ ఓడింది. ఇక 2024లో మాత్రం ఆయనా గెలిచారు, పార్టీ గెలిచింది. దాంతో ఆయన చిరకాల కోరిక నెరవేరింది. ఆయనకు అత్యంత కీలకమైన శాఖలు దక్కాయి. చంద్రబాబు తరువాత సీటు అసెంబ్లీలో ఆయనదే, ఆర్ధిక శాసనసభా వ్యవహారాలు ఆయన చూస్తున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్ 12న ప్రమాణం చేసింది. జూలై 23 నుంచి అయిదు రోజుల పాటు బడ్జెట్ సెషన్ ని నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేశారు. అంతా బాగానే ఉన్నా తొలిసారి మంత్రిగా అందునా ఆర్ధిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ మాత్రం తన మొదటి బడ్జెట్ ని సభలో ప్రవేశ పెట్టలేకపోయారు.
అదే సమయంలో తెలంగాణా ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టారు. కేంద్రంలో నిర్మలా సీతారామన్ ఏడవసారి వరసగా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఏ ఆర్ధిక మంత్రి కైనా ఇది బ్రహ్మాండమైన అధికారం. బడ్జెట్ ని ప్రవేశపెట్టడం కీలకమైన స్పీచ్ ని సభలో ఇవ్వడం ద్వారా ఆర్ధిక మంత్రి ముఖ్యమంత్రి తరువాత అంతటి హోదాతో ఉంటారు.
టీడీపీలో చూస్తే ఆర్ధిక మంత్రిగా యనమల రామక్రిష్ణుడు చాలా కాలం పనిచేశారు. మరో వైపు చూస్తే ఏ ఏటికి ఆ ఏడు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దానిని భిన్నంగా బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే ముగిసింది. నెడో రేపో ఓటాన్ అకౌంట్ ని తెస్తూ ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తారు.
మరి ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎన్ని నెలలో చూసుకుని ఆ మీదట మిగిలిన కాలానికి అయినా రానున్న సమావేశాలలో బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి హోదాలో పయ్యావుల ప్రవేశపెడతారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ అలా కాదు అని అనుకుంటే కనుక 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ నే పయ్యావుల ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
అంటే అలా అయితే కనుక 2025 మార్చి దాకా పయ్యావుల బడ్జెట్ కోసం ఎదురుచూడాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి ఆర్ధిక మంత్రి బడ్జెట్ ని ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెడతారా లేదా అన్నదే ప్రస్తుతానికి చర్చగా సాగుతోంది. పయ్యావుల ఆశలు ఆ విధంగా నెరవేరుతాయా అన్నది కూడా మరో చర్చగా ఉంది.