Begin typing your search above and press return to search.

క్యాస్టా ? కమిట్ మెంటా ? కలిసొచ్చింది ఏమిటి ?!

ఎన్ఎస్ యూఐ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మహేష్ కుమార్ గౌడ్ 90వ దశకం నుండి పార్టీకి విధేయుడుగా ఉంటూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 1:30 PM GMT
క్యాస్టా ? కమిట్ మెంటా ? కలిసొచ్చింది ఏమిటి ?!
X

సుధీర్ఘ విరామం, అనేక ఊహాగానాల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడుగా కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. ఈ పదవి కోసం ఇదే సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కీ గౌడ్, జగ్గారెడ్డి, బాలూనాయక్, బలరాం నాయక్ తదితరులు పోటీ పడ్డారు.

ఎన్ఎస్ యూఐ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మహేష్ కుమార్ గౌడ్ 90వ దశకం నుండి పార్టీకి విధేయుడుగా ఉంటూ వస్తున్నాడు. 1994లోనే డిచ్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2004 ఎన్నికల్లో డీఎస్ పోటీగా ఉండడంతో పార్టీ టికెట్ దక్కక టీడీపీలో చేరాడు. ఆ తర్వాత వైఎస్ ఆహ్వానించడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరిపోయాడు. 2014 వరకు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశాడు.

రేవంత్ పార్టీలో చేరినప్పటి నుండి సన్నిహిాతంగా ఉంటూ వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ 2023 శాసనసభ ఎన్నికల్లో షబ్బీర్ అలీ కోసం రేవంత్ మాట మేరకు సీటును త్యాగం చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే పీసీసీ చీఫ్ కోసం పార్టీలో తీవ్ర కసరత్తే నడిచింది.

తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సురేష్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్ లను సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మిగతా వారిని పీసీసీ కొత్త చీఫ్ గా నియమించాలని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం.

అయితే సుధీర్ఘంగా పార్టీకి విధేయుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. దీంతో అధిష్టానం కూడా బీసీ సామాజికవర్గం నేపథ్యంతో పాటు, తెలంగాణలో బలంగా ఉన్న గౌడ సామాజిక వర్గం, పార్టీ విధేయతను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.