ఏపీలో 'పీడీ' యాక్టులు.. పర్యవసానాలు ... !
ఏపీ విషయానికి వస్తే.. తాజాగా డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై పీడీ(ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
By: Tupaki Desk | 1 Dec 2024 4:30 PM GMTశిక్షలకు కూడా ఒక హద్దు ఉంటుంది- ఇదీ.. గత ఏడాది సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన మాట. యూపీకి చెంది న బుల్‌డోజర్ల సంస్కృతిని ప్రస్తావిస్తూ.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ నేరానికి ఎలాంటి శిక్ష వేయాలనేది కోర్టులు నిర్ణయిస్తాయని.. చట్టాలు, శిక్షాస్మృతులు ఉన్నాయని కూడా గుర్తు చేసింది. ఒక వ్యక్తి నేరం చేశాడని.. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులను రాత్రికిరాత్రి ఎలా కూల్చి వేస్తారని కూడా నిలదీసింది. ఈ క్రమంలోనే శిక్షలకు కూడా ఒక హద్దు ఉంటుందని స్పష్టం చేసింది.
కట్ చేస్తే.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏపీ విషయానికి వస్తే.. తాజాగా డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై పీడీ(ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంటే.. ముందస్తుగానే వారిని నిర్బంధించే వెలుసుబాటు పోలీసులకు దక్కుతుంది. వాస్తవానికి సోషల్ మీడియాలో వచ్చే దుర్భాష లపైనా.. పోస్టులపైనా.. లైంగిక వేధింపులపైనాచర్చలు తీసుకోవద్దని ఎవరూ చెప్పరు.
ఇదే విషయాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా చెప్పారు. సోసల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిని వదిలి పెట్టాలని ఆయన కూడా చెప్పలేదు. కానీ, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్న వాదనను మాత్రం ఖండించారు. ఇదే విషయాన్ని న్యాయనిపుణుల నుంచి మేధావుల వరకు కూడా తప్పుబడుతున్నారు. పీడీ యాక్ట్ అనేది సంఘ విద్రోహ శక్తులు, సమాజంలో అలజడి(హత్యలు, మారణకాండలను ప్రోత్సహించడం, మత ఘర్షణలు రెచ్చగొట్టడం వంటివి) సృష్టించేవారిపై పెడతారని అంటున్నారు.
కానీ, ఏపీ పోలీసులు సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్లలోఆనందం కోసం పరితపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పీడీ చట్టాలు తెస్తామని చెబుతున్నారు. కానీ, రేపు కోర్టులకు వెళ్తే.. ప్రభుత్వం బద్నాం అవుతుంది. పీడీయాక్టులు.. సోషల్ మీడియాకు వర్తించవు. ఒకవేళ పెట్టాలని అనుకున్నా.. సమాజంలో కల్లోలం సృష్టించారన్న సరైన ఆధారాలు సమర్పించాలి.
ఇవేవీ ఆలోచించకుండానే.. గతంలో వైసీపీ అధినేతకళ్లలో ఆనందం కోసం.. చట్టాలను తుంగలో తొక్కారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి మాదిరిగానే ఇప్పుడు కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకుని ప్రత్నామ్నాయాలు ఆలోచించాల్సి ఉంది. లేకపోతే.. రేపు కోర్టులకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.