కశ్మీర్ తొలి అసెంబ్లీనే రణరంగం.. మంటలు రేపిన ఆర్టికల్ 370
దీంతోనే రాజకీయంగా పరిస్థితి సంక్లిష్టంగా ఉండబోతోందని ముందే తెలిసిపోయింది.
By: Tupaki Desk | 7 Nov 2024 6:13 AM GMTదాదాపు ఆరేళ్ల అనంతరం తొలిసారిగా కొలువుదీరిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి రోజే రణరంగంగా మారింది. ఆర్టికల్ 370 రద్దుతో 2019 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్ లో ఇటీవల ఎన్నికలు జరగడం, అందులో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ కూటమి గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కూటమికి వచ్చిన సీట్లలో అత్యధికం కశ్మీర్ లోయవే. జమ్మూలో మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. దీంతోనే రాజకీయంగా పరిస్థితి సంక్లిష్టంగా ఉండబోతోందని ముందే తెలిసిపోయింది. దీనికితగ్గట్లే ప్రస్తుతం ఘటన జరిగింది.
ఎమ్మెల్యేల బాహాబాహీ
జమ్మూకశ్మీర్ కు ఆర్టికల్ 370 అనేది ప్రత్యేక హోదా కల్పించే సంగతి తెలిసిందే. దీనిని 2019లో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కశ్మీర్ ను కశ్మీర్, లద్దాఖ్ లుగా విభజించింది. లద్దాఖ్ మాత్రం అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఇక తాజా ఎన్నికలతో కశ్మీర్ కు అసెంబ్లీ కొలువైంది. తొలిసారిగా గురువారం కొలువుదీరింది. అయితే, అనుకుంటున్నట్లుగానే తీవ్ర గందరగోళం చెలరేగింది. యుద్ధ వాతావరణం తలెత్తింది. ఏకంగా ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో రణరంగాన్ని తలపించింది.
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై..
ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశం వివాదాస్పదం అవుతుందని మొదటినుంచి ఊహాగానాలు ఉన్నాయి. కశ్మీర్ అసెంబ్లీలో గురువారం అలాగే జరిగింది. అసెంబ్లీ కార్యక్రమాలు మొదలుకాగానే.. ఇంజినీర్ రషీద్ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ లు ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోరుతూ
బ్యానర్ ను ప్రదర్శించారు. అయితే, దీనిపై బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ అభ్యంతరం తెలపడంతో తీవ్ర గందరగోళం రేగింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకెళ్లి పిడిగుద్దులు కురిపించుకున్నారు. మార్షల్స్ రంగంలోకి దిగి వారిని విడదీశారు. కాగా, తమ ఎమ్మెల్యేలను బయటకు పంపడంపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఖుర్షీద్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ ను తప్పుబట్టారు. దీంతో స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.
కూటమి డిమాండ్ మేరకు..
కేంద్ర ప్రభుత్వం 2019లో తొలగించిన ఆర్టికల్ 370, 32ఏ లను పునరుద్ధరించాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ప్రత్యేక రాష్ట్ర హోదాను డిమాండ్ చేసింది. మరోవైపు బుధవారం కూడా ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానం బీజేపీ సభ్యులు చించివేశారు.