పెద్దాపురంలో వైసీపీ వర్సెస్ టీడీపీ హీటెక్కిన పాలిటిక్స్
సోమవారం ఉదయం పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌కు రావాలని చినరాజప్పకు సవాల్ విసిరారు.
By: Tupaki Desk | 31 July 2023 12:28 PM GMTకాకినాడ జిల్లా పెద్దాపురం అంటేనే ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ కూడా జరుగుతుంది. వరుసగా ఇక్కడటీడీపీ విజయం దక్కించుకుంటోంది. అయితే.. ఈదఫా మాత్రం వైసీపీ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.
దీంతో ఇక్కడ తరచుగా రెచ్చగొట్టుకునేలా ఇరు పక్షాల మధ్య రాజకీయం సాగుతుండడంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితే కనిపించింది. టీడీపీ, వైసీపీ నాయకులు సవాళ్లు రువ్వుకున్నారు.
గత వారం రోజులుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలో లైడిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. సోమవారం ఉదయం పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌కు రావాలని చినరాజప్పకు సవాల్ విసిరారు. తాను వచ్చేందుకు సిద్ధమని.. అక్కడే తేల్చుకుందామని చినరాజప్ప కూడా ప్రతి సవాల్ విసిరారు. ఈ క్రమంలో మరింతగా రాజకీయం వేడెక్కినట్టయింది.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇరువురు నేతలు తమ కార్యాలయాల్లో కార్యకర్తలతో సిద్ధమయ్యారు. అనంతరం మున్సిపల్ సెంటర్‌కు వెళ్లేందుకు ఇటు టీడీపీ, అటు వైసీపీ నాయకులు లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని.. అయితే.. ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని పరస్పరం దూషించుకున్నారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు పక్షాల వారిని అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని చెప్పారు. దీంతో పార్టీ కార్యాలయాల వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం ఎవరికి వారు వెనక్కి వెళ్లిపోయారు.