పార్టీలో విభేదాలు సహజమే.. వీఎస్ఆర్ రాజీనామాపై పెద్దిరెడ్డి
రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు విజయసాయి ప్రకటించిన వారం రోజుల తర్వాత ఈ విషయమై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 2 Feb 2025 12:30 PM GMTవైసీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు విజయసాయి ప్రకటించిన వారం రోజుల తర్వాత ఈ విషయమై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎక్కడా విజయసాయి పేరు ప్రస్తావించకపోయినా, పార్టీ అన్నాక చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఉంటుంటాయని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం చర్చకు తావిస్తోంది.
పార్టీలో కొత్తగా పదవులు పొందిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు అంటూ మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి పరోక్షంగా వీఎస్ఆర్ రాజీనామాపై వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదవులు పొందిన వారిందరికీ అభినందనులు. కొత్తగా పదవుల్లోకి వచ్చిన వారు పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. పార్టీ అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అంతా సర్దుకుపోవాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అయితే పెద్దిరెడ్డి వ్యాఖ్యలు విజయసాయిని ఉద్దేశించినవేనా? అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే కొనసాగిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాల నుంచి వైదొలగారు. ఆయన రాజీనామాను పార్టీ అధిష్ఠానం కూడా ఆమోదించింది. అయితే రాజీనామా తర్వాత ఆయన మాజీ సీఎం జగన్ సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఇద్దరూ చర్చించారు. ఈ భేటీ రాజకీయంగా చాలా ఆసక్తి రేపుతోంది. దీంతో పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారంటున్నారు.
తన రాజీనామాకు ఎలాంటి రాజకీయ, ఆర్థిక కారణాలు లేవని విజయసాయిరెడ్డి చెబుతున్నా, ఆయన ఆకస్మిక రాజకీయ సన్యాసానికి బలమైన కారణమేదో ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఒక్కోసారి సర్దుకుపోవాల్సివస్తుందనే యాంగిల్ లో పెద్దిరెడ్డి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారాయి.