Begin typing your search above and press return to search.

ఈనాడుపై రూ.50 కోట్లకు దావా వేస్తా : పెద్దిరెడ్డి

తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తోన్న ఈనాడు సంస్థపై రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

By:  Tupaki Desk   |   30 Jan 2025 8:58 AM GMT
ఈనాడుపై రూ.50 కోట్లకు దావా వేస్తా : పెద్దిరెడ్డి
X

తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తోన్న ఈనాడు సంస్థపై రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో తాను 75 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు తప్పుడు కథనాలు రాశారని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ఆరోపించారు. ఆ భూమిని తాను 2001లోనే కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో ఈనాడు తనపై అసత్యాలు ప్రచారం చేస్తోందని పెద్దరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి ఈనాడు కథనాలను తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. తన పరువుకు భంగం కలిగించిన వార్తలు ప్రచురించినందుకు గాను పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. మదనపల్లె కేసులో ఇదే విధంగా వ్యవహరించారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

మంగళంపేటలో తన కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న భూములను 2001లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. అన్ని వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని చెప్పారు. ఆ భూములపై చంద్రబాబు ప్రభుత్వం గతంలో విచారణ జరిపిందని, అటవీ భూములు లేవని క్లీన్ చిట్ ఇచ్చిందని తెలియజేశారు. రికార్డులు అన్నీ తనకు అనుకూలంగా చాలా స్పష్టంగా ఉన్నాయని, కానీ ఈనాడు అన్నీ వక్రీకరించి తప్పుడు కథనాలు రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడుపై చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు.