వైసీపీ కీలక నేతకు దెబ్బ మీద దెబ్బ !
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్యకు సంబంధించి 142 స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించలేదని బోడె రామచంద్ర యాదవ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
By: Tupaki Desk | 1 Aug 2024 10:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ హయాంలో నంబర్ టూగా చక్రం తిప్పారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విద్యుత్, గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన రాయలసీమను తన కనుసైగతో శాసించారు. రాయలసీమలో ఆయన చెప్పినవారికే వైసీపీ తరఫున సీట్లు దక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలో కాలుపెట్టనీయకుండా అడ్డుకోవడంతోపాటు ఆయనను ఓడించడానికి పెద్దిరెడ్డి గట్టిగానే ప్రయత్నించారు.
అయితే డామిట్.. కథ అడ్డం తిరిగింది అన్నట్టు ఇటీవల ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి గెలుపొందినా చాలా తక్కువ మెజారిటీతోనే బయటపడ్డారు.
మంత్రిగా ఉన్న సమయంలో గనులు, విద్యుత్ శాఖలో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే అసైన్డ్ భూములు, చుక్కల భూములను పెద్ద ఎత్తున తన కుటుంబం పరం చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన అభియోగాలు ఉన్నాయి. ఈ విషయాలపైన కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. తమ భూములను కబ్జా చేశారని పెద్ద ఎత్తున బాధితులు అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.
మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో భూముల రికార్డులు కాలిపోవడం వెనుక కూడా పెద్దిరెడ్డి పాత్ర ఉందనే అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు, ఆయన పీఏ, తదితరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇప్పుడు ఈ కష్టాలు చాలవన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో ఇబ్బంది ఎదురైంది. ఎన్నికల అఫిడవిట్ లో పెద్దిరెడ్డి అన్ని విషయాలను వెల్లడించలేదని.. కొన్ని విషయాలను దాచారని.. ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు. పెద్దిరెడ్డి ఎన్నికను చెల్లనిదిగా కొట్టేయాలని కోరారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్యకు సంబంధించి 142 స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించలేదని బోడె రామచంద్ర యాదవ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తద్వారా ఎన్నికల సంఘాన్ని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోర్టును విన్నవించారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరినీ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని రామచంద్ర యాదవ్ కు ఆదేశాలు ఇచ్చింది.
పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ పిటిషన్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వారి పేర్లను వ్యాజ్యంలో చేర్చాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.