టార్గెట్ బాలయ్య... హిందూపురంలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన పెద్దిరెడ్డి!
వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే ఎన్నికల కోసం ప్రధానంగా రెండు కీలక బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తుంది
By: Tupaki Desk | 10 Jan 2024 12:43 PM GMTవైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే ఎన్నికల కోసం ప్రధానంగా రెండు కీలక బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో ప్రధానంగా తనకు బాధ్యత ఇచ్చిన ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు గెలిపించడం ఒకటైతే.. ప్రధానంగా కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలయ్యని ఓడించడం మరొకటనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం హిందూపురంపై దృష్టిపెట్టిన పెద్దిరెడ్డి... కీలక ప్రకటనలు చేశారు.
అవును... హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బాలకృష్ణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుంది వైసీపీ. ఇందులో భాగంగా.. బాలయ్య తన నియోజకవర్గంలో పర్యటిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా.. ఆయనకు పోటీగా మంత్రి పెద్దిరెడ్డి కూడా అక్కడే మకాం వేశారు. ఈ సందర్భంగా ఈ దఫా హిందూపురంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈరోజు హిందూపురంలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు పెద్దిరెడ్డి. ఇందులో భాగంగా... హిందూపురం పార్లమెంట్, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన పెద్దిరెడ్డి... అందులో భాగంగా హిందూపురం అసెంబ్లీ నుంచి కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక పోటీ చేస్తారని ప్రకటించారు.
ఇదే సమయంలో... బోయ - వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత.. హిందూపురం పార్లమెంటు నుంచి బరిలో ఉంటారని వెల్లడించారు. ఈ విధంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంతకాలం వరుసగా టీడీపీని గెలిపిస్తున్నందుకు ఏమి అభివృద్ధి జరిగిందో తెలపాలని ప్రశ్నించారు.
అనంతరం.. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసిన పెద్దిరెడ్డి... ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో ఉన్న అసంతృప్తిని త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. ఇక జనసేనలో పవన్ తప్ప ఆ పార్టీనుంచి పోటీచేసేవారెవారూ కనిపించడం లేదని తెలిపిన ఆయన... టీడీపీ – జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.