Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మరో 236 ఎకరాలు... తెరపైకి షాకింగ్ వివరాలు!

తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు మరో 236 ఎకరాలు ఉన్నట్లు లెక్కల్లో తేలిందని అంటున్నారు

By:  Tupaki Desk   |   31 July 2024 4:23 AM GMT
పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మరో 236 ఎకరాలు... తెరపైకి షాకింగ్ వివరాలు!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న పలు అక్రమాలు, అక్రమ కట్టడాలు, భూ కజ్ఞాలు మొదలైన వాటిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసి, వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తుల విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు మరో 236 ఎకరాలు ఉన్నట్లు లెక్కల్లో తేలిందని అంటున్నారు. ఇందులో భాగంగా... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయన భార్య స్వర్ణలత.. కుమారుడు, రాజంపెట ఎంపీ మిథున్ రెడ్డి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 236 ఎకరాల భూములు ఉన్నట్లు బయట పడిందని.. "మీ భూమి"లోని వివరాల ప్రకారం అధికారులు లెక్క తేల్చారని అంటున్నారు.

అవును... ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన అనంతరం.. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పేరిట ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే... వెబ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం చిత్తురు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరిట వివిద సర్వే నంబర్లతో సబ్ డివిజినల్స్ వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41.35, ఆయన భార్య స్వర్ణలత పేఋఇట 171.23, కొడుకు మిథున్ రెడ్డి పేరిట 23.42 ఎకరాల భూమి ఉన్నట్లు తేలిందని అంటున్నారు. వాస్తవానికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం... ఒక కుటుంబం వద్ద 54 ఎకరాల మెట్ట భూములు, 27 ఎకరాలకు మించి మాగాణి ఉండకూడదు. అయితే... పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆధీనంలో మాత్రం వందల ఎకరాలున్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో అనూహ్యంగా పెద్దిరెడ్డి భార్య పేరుమీద ఎసైన్డ్ ల్యాండ్ కూడా ఉంది! ఇందులో భాగంగా... తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని వికృతమాల గ్రామంలో ఆమె పేరుమీద 27.7 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో 7.6 ఎకరాలు కొనుగోలు చేసినట్లు రికార్డ్స్ లో ఉండగా.. మిగతాభూమి 2004-07 మధ్య ఎసైన్డ్ చేసినవే అని చెబుతున్నారు.

అదేవిధంగా... పుంగనూరు మండలం రాగానిపల్లెలో అక్రమంగా క్రమబద్ధీకరించినట్లు చెబుతున్న 982.48 ఎకరాల్లో పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల వాటాలే సుమారు 600 ఎకరాలనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరోపక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు, అనుచరుల పేర్లతోనూ వందల ఎకరాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.