పెద్దిరెడ్డిపై పవన్ కీలక వ్యాఖ్యలు... అటు నుంచి స్ట్రాంగ్ కౌంటర్!
ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 2 July 2024 5:46 AM GMTఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... మాజీమంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లింగ్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆయనపై నేపాల్ పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.
అవును... కాకినాడ జిల్లా పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... మిథున్ రెడ్డి పెద్ద ఎత్తున తిరుపతి నుంచి నేపాల్ కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి వాహనాలకు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ల వద్ద ఎలాంటి అడ్డూ ఉండట్లేదని అన్నారు.
తిరుపతి నుంచి నేపాల్ కి ఇన్ని చెక్ పోస్ట్ లను దాటుకుని ఎర్రచందనం వాహనాలు నేపాల్ సరిహద్దుకు ఎలా వెళ్లగలుగుతున్నాయని పవన్ ప్రశ్నించారు! ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డిపై నేపాల్ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైల్ తన వద్దకు వచ్చిందని.. పట్టుబడ్డ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకురావాల్సి ఉందని పవన్ తెలిపారు.
దీంతో... ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. దీక్షలో ఉంటూ ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారంటూ ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం తమపై వ్యక్తిత్వ హనానికి పాల్పడతారని నిలదీశారు. ఇదే సమయంలో... పవన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారనే విషయం మరిచిపోతున్నట్లున్నారని అన్నారు.
అధికారంలో ఉన్న పవన్ ఆరోపణలు చేయకుండా... పోలీసులు, వ్యవస్థలు మొత్తం ఆయన చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఆరోపణలపై తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా... పవన్ కు ఓ సవాల్ విసిరారు. ఇప్పుడేకాదు తాను ఎప్పుడైనా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కు ఐదేళ్లపాటు సమయం ఉందని గుర్తుచేసిన మిథున్ రెడ్డి... ఈ లోగా తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమేనా? అని సవాల్ చేశారు. మరి ఈ సవాల్ కు పవన్ స్పందిస్తారా.. లేక, ఆరోపణలు చేసి ఊరుకుంటారా.. అదీ గాక నిరూపించి చూపిస్తారా అనేది వేచి చూడాలి!