మదనపల్లె దస్త్రాల దహనం కేసు... ఎటు చూసినా పెద్దిరెడ్డితోనే కనెక్షన్?
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనకు కారకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అనే చర్చ బలంగా జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2025 6:06 AM GMTమదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనకు కారకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అనే చర్చ బలంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఫ్రీ హోల్డ్, డీపట్టా భూముల అక్రమ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఈ పనికి పూనుకున్నారనే చర్చ బలంగా వినిపిస్తుందని చెబుతున్నారు.
ఈ విషయంలో ప్రధానంగా పెద్దిరెడ్డితో పాటు ఆయన పీఏ ముని తుకారాం, సన్నిహిత అనుచరుడు మాధవరెడ్డిలు.. రెవెన్యూ డిపార్ట్ మెంట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పురికొల్పి ఈ కార్యక్రమానికి తెరలేపినట్లు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ముని తుకారాం, మాధవరెడ్డి మరికొంతమందితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడైందని అంటున్నారు.
దీని వెనుక పెద్దిరెడ్డి ఆదేశాలు, అండదండలే కారణం అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన గౌతం తేజ రిమాండ్ రిపోర్టులో పలుచోట్ల పెద్దిరెడ్డి పేరుండగా.. ఈ కేసులో నాలుగో నిందితుడైన ఆయన పీఏ ముని తుకారాం గతేడాది జూలైలో అమెరికాకు వెళ్లిపోయిన పరిస్థితి.
ఈ కేసులో ఇలా ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న ముని తుకారాంలను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే అంతిమ లబ్ధిదారు ఎవరు.. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ పనికి పూనుకున్నారు అనే విషయాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే అరెస్టైన గౌతం తేజ - మాధవరెడ్డి మధ్య ఘటన జరిగిన తర్వాత 10 రోజుల్లో 7 సార్లు 510 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారనేది ఇక్కడ కీలక అంశం అని అంటున్నారు!
ఇదే సమయంలో మాధవరెడ్డి - పెద్దిరెడ్డి మధ్య 52 ఫోన్ కాల్స్ ఉండగా.. మాధవరెడ్డి - ముని తుకారాం మధ్య 331 ఫోన్ కాల్స్ నడిచినట్లు చెబుతున్నారు.
ఇక ప్రధానంగా... నాడు వైసీపీ సర్కార్ జీవో నెంబర్ 596 విడుదల చేయగా.. దాని ప్రకారం మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 48,360.12 ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేయగా.. అందులో 22.523.50 ఎకరాల భూమి నిబంధనలూ ఉల్లంఘించి అక్ర్మంగా ఫ్రీ హోల్డ్ చేసిందే అనేది ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు. పైగా.. ఇదంతా ఆర్డీవో మురళి హయాంలోనే జరిగిందని అంటున్నారు.
అయితే... ఇందులో నిషేధిత జాబితలోని 14 వేల ఎకరాల భూములను మాధవరెడ్డి, పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం, ఇతర రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు వారి వారి బినామీల పేరిట ఆర్డీవో మురళి వీటిని రెగ్యులరైజ్ చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.