కాంగ్రెస్ లో షర్మిల చేరిక.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Jan 2024 9:57 AM GMTవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన షర్మిల అక్కడ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ మంత్రి, ఆ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజకీయాల్లో మేం పార్టీ మారి మా కాళ్లు మేమే నరుక్కుంటామా? అని ప్రశ్నించారు.
కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే నైజం సోనియాగాంధీది, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. అందుకే ఆనాడు ఇద్దరూ కలిసి జగన్ ను జైలుకు పంపించారని హాట్ కామెంట్స్ చేశారు. కుటుంబాల్ని కాదు మనుషులను చీల్చి రాజకీయాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.
రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాము పద్ధతి ప్రకారం రాజకీయాలు నడిపిన వ్యక్తులమని తెలిపారు. ఆ పద్ధతి ప్రకారమే జగన్ తోనే ఉంటామన్నారు. మంచి జరిగినా.. చెడు జరిగినా జగన్ వెంట ఉంటామని స్పష్టం చేశారు. జగనే తమ నాయకుడని.. ఆయనతోనే కలిసి పని చేస్తామని తేల్చిచెప్పారు. తిరిగి జగన్ అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషి చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని పెద్ది రెడ్డి అన్నారు. రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడడం మంచిది కాదని చెప్పారు. ఒక జడ్పీటీసీగా ఓడిపోయిన ఆయన్ని ఎమ్మెల్యేగా చేశామని.. ఇది ఆయన తెలుసుకోవాలని సూచించారు.
చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి ఈ మేరకు షర్మిల వ్యవహారంపై స్పందించారు. జగన్ పై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని వైసీపీ కోసం çపనిచేయాలని సూచించారు.
కాగా మంత్రి పెద్దిరెడ్డి కామెంట్లను బట్టి షర్మిలపై వైసీపీ స్టాండ్ ఇదేనని అంటున్నారు. జగన్ అనుమతి లేకుండా ఆయన షర్మిల వ్యవహారంపై మాట్లాడి ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా తాము వారిని ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పడం ద్వారా వైసీపీ స్టాండ్ ను ఆయన ప్రకటించారని అంటున్నారు.