ప్రజల సొమ్ముతో సీసీ రోడ్డు.. ప్రైవేటు గేటు.. పెద్దిరెడ్డా మజాకానా?
ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వెలిగిపోయిన అత్యంత ముఖ్యుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
By: Tupaki Desk | 5 July 2024 8:09 AM GMTఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వెలిగిపోయిన అత్యంత ముఖ్యుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమలో అందునా చిత్తూరు జిల్లాలో ఆయనేం చెబితే అదే నడిచేది. అందుకు మాట కూడా పక్కకు పొర్లేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయన తీరు.. చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
తాజాగా తిరుపతి ఎయిర్ పోర్ట్ బైపాస్ రోడ్డు సమీపంలో ప్రజల సొమ్ముతో వేయించుకున్న సీసీ రోడ్డును ఆయనెంత విలాసంగా వాడుకున్నారో ఇట్టే అర్థమయ్యే ఉదంతమిది. ఇక్కడ పెద్దిరెడ్డి గారి వైభోగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రాయల్ నగర్ లోఆయనకు మూడు ఎకరాల విస్తీర్ణంలో పెద్దిరెడ్డి వారికి ఇల్లు ఉంది. ఈ భూమిపైనా వివాదం ఉంది. బుగ్గమఠం భూముల్ని అక్రమించారని స్థానికులు ఆరోపిస్తుంటారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడు.
పంచాయితీగా ఉన్న వేళలో ఒక మట్టి రోడ్డు ఉండేది.కార్పొరేషన్ లో కలిసిపోయిన తర్వాత గ్రావెల్ రోడ్డు నిర్మించారు. వెస్ట్ చర్చితో పాటు.. ఎమ్మార్ పల్లి వైపు నుంచి ఈ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగేవి. జగన్ ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేయించుకున్నారు. ఇలాంటివి చాలామంది చేసే పనే కదా? అనుకోవచ్చు. అందరిలా చేస్తే ఆయన పెద్దిరెడ్డి ఎందుకు అవుతారు? తనకంటూ ఒక మార్కు ఉండాలి కదా? అందుకే ఆయన.. సీసీ రోడ్డు వేయించుకోవటమే కాదు.. ఆ రోడ్డును మరెవరూ వాడకుండా ఉండేందుకు ఏకంగా గేటు ఏర్పాటు చేయించుకున్నారు.
దీని కారణంగా అక్కడి స్థానికులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నా.. పెద్దిరెడ్డి వారు మాత్రం కుదరదంటే.. కుదరదని ఫర్మానా జారీ చేశారు. రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిన నేపథ్యంలో జనసేన నేతలు ధర్నాకు దిగారు. అయితే.. వారిని అక్కడి నుంచి జనసైనికుల్ని పంపించే విషయంలో పోలీసులు శ్రద్ధ చూపుతున్నారే కానీ.. దారి తెరిచే విషయంలో ఇప్పటికి చట్టబద్ధంగా వ్యవహరించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వాలు మారిన తర్వాత పెద్దిరెడ్డి హవా కొనసాగుతుందన్న విమర్శ జనసైనికుల నుంచి వస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.