లడ్డూ రగడ.. ప్రముఖ పీఠాధిపతులు ఏమంటున్నారు?
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Sep 2024 8:20 AM GMTవైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. లడ్డూ తయారీలో ఏ తప్పూ జరగలేదని.. నాణ్యతకు ఏమాత్రం లోటు రాలేదని గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఈ విషయంలో దేవుడి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసురుతున్నారు.
మరోవైపు టీటీడీ ఈవో శ్యామలరావు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయని బాంబుపేల్చారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీయడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు శ్రీవారి లడ్డూ వివాదంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జంతువుల కొవ్వులు కలిపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ పీఠాధిపతులు కూడా తిరుమల లడ్డూ తయారీ వివాదంపై స్పందించారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు కలిపినట్టు తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యామన్నారు. ఈ ఘటనపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా పెదపులిపాకలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మీడియా సమావేశం నిర్వహించారు.
హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో పీఠాధిపతులు లడ్డూ వివాదంపై స్పందించారు.
ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
తిరుమలలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. స్వామివారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలని సూచించారు.
శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో ల్యాబ్ నివేదికలే మనకు ఆధారమన్నారు. అవి తప్పు జరిగిందని తేల్చినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఇంకా తప్పు జరగలేదని చెప్పుకుంటే అది ఇంకో తప్పు అవుతుందన్నారు. ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలని సూచించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తేనే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు.