Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ అభ్యర్థి సంచలనం.. రూ.5,785 కోట్ల ఆస్తులు ప్రకటన!

అవును... పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక్కసారిగా అందిరి చూపునూ టీడీపీ ఎంపీ అభ్యర్థి తనవైపు తిప్పుకున్నారు

By:  Tupaki Desk   |   22 April 2024 1:50 PM GMT
టీడీపీ ఎంపీ అభ్యర్థి సంచలనం.. రూ.5,785 కోట్ల ఆస్తులు ప్రకటన!
X

ఎన్నికల సీజన్ స్టార్ట్ అయ్యింది. నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ సమయంలో అభ్యర్థులంతా ఒక్కొక్కరుగా ముహూర్తాలు పెట్టుకుని మరీ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అఫిడవిట్ లో వారి వారి ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, కేసులు మొదలైన వివరాలు పొందుపరుస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే అత్యధిక మొత్తాన్ని అఫిడవిట్ లో పేర్కొన్న నేతగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి తెరపైకి వచ్చారు!

అవును... పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక్కసారిగా అందిరి చూపునూ టీడీపీ ఎంపీ అభ్యర్థి తనవైపు తిప్పుకున్నారు. తన ఎన్నికల అఫిడవిట్ లో వంద కాదు రెండొందలు కాదు ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. దీంతో... ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ స్థాయిలో ఆస్తుల వివరాలను ప్రకటించిన అరుదైన ఎంపీ అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఆయనే... గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.

నిత్యం రాజకీయాలను ఫాలో అయ్యే వారికి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. టీడీపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు తనను ప్రకటించినప్పటినుంచీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు పెమ్మసాని. ఇదే సమయంలో... సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా ఆయన ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా.. పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ లో తన కుటుంబానికి రూ.5,785 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598.65 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.186.63 కోట్లుగా ఆయన వెల్లడించారు. ఇదే క్రమంలో... రూ.1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో... రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థిగా నిలిచారు!

కాగా... వృత్తి రీత్యా వైద్యుడైన పెమ్మసాని చంద్రశేఖర్... అమెరికాలో సుదీర్ఘంగా వైద్య వృత్తిలో కొనసాగారు. ఇదే సమయంలో వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపార రంగాల్లోనూ ప్రవేశించి సక్సెస్ అయ్యారు.