ఎ అంటే అమరావతి .. పి అంటే పోలవరం
ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందే అవకాశం ఉందన్నారు.
By: Tupaki Desk | 28 July 2024 4:37 PM GMTఏపీ అంటే ‘ఎ’ అంటే అమరావతి, ‘పి’ అంటే పోలవరం. ఈ రెండు నిర్మాణాలు పూర్తి చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాతాంశాలు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా సహకరిస్తుంది. రెండేళ్లలో పోలవరం పూర్తికావాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది అని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరిగిందని, గత ఐదేళ్లుగా కేంద్రం నిధులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితి నెలకొందని పెమ్మసాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతికి రూ.15 వేల కోట్లు, రైల్వే బడ్జెట్ కింద అమరావతికి రైల్వే లైన్ కోసం రూ.2500 కోట్ల నిధులు కేటాయించారని పెమ్మసాని తెలిపారు.
4 కోట్ల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ తో ఉద్యోగ అవకాశాలు వస్తాయని, కోటి మందికి సోలార్ పథకంలో సబ్సిడీ కల్పించడం, 2 కోట్ల రూరల్, కోటి అర్బన్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందే అవకాశం ఉందన్నారు. నరేగా నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, ఈ ప్రభుత్వంలో ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటామని పెమ్మసాని అన్నారు. ఏపీలో 50 కోట్లతో పోస్టల్ డిపార్ట్ మెంట్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మాణం చేపడతామని తెలిపారు.