Begin typing your search above and press return to search.

జైల్లో ఖైదీ వద్ద పెన్ కెమెరా... జడ్జికి చంద్రబాబు సంచలన లేఖ!

అదేవిధంగా... తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారిందని, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కు ఓ లేఖ కూడా అందినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం.

By:  Tupaki Desk   |   27 Oct 2023 7:05 AM GMT
జైల్లో ఖైదీ వద్ద పెన్  కెమెరా... జడ్జికి  చంద్రబాబు సంచలన లేఖ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు... 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా అరెస్టైన కొత్తలో బాబు భద్రతపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జైల్లో తీవ్ర నేరాలు చేసిన వారు, నక్సలైట్లు ఉన్నారని.. వారితో బాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బాబుకు ఉన్న సెక్యూరిటీపై పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. పలు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆ తర్వాత ఆ విషయంపై పెద్దగా టీడీపీ నుంచి స్పందన రాలేదు కానీ... బాబు ఆరోగ్యం పై మాత్రం ఇప్పటికీ ఆరోపణన్లు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతా లోపాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందుకు చంద్రబాబు లేఖ రాశారు. ఇందులో భాగంగా... తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న చంద్రబాబు.. తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇందులో రాజమండ్రి జైల్లో పలు భద్రతా లోపాలు ఉన్నాయంటూ ఆయన ప్రస్తావించారు. ఇదే సమయంలో... పెన్ కెమెరాతో జైల్లో ఒక రిమాండ్ ఖైదీ తిరుగుతున్నాడని బాబు సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు ఇలా పలు అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాబు ఆరోపించారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా... తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారిందని, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కు ఓ లేఖ కూడా అందినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. అయితే... ఈ విషయంపై పోలీసులు అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదని, ఆ లేఖపై విచారణ కూడా జరపలేదని బాబు లేఖలో ఆరోపించారు.

అదే విధంగా... రిమాండ్ ఖైదీగా ఉన్న ఎస్ కోటకు చెందిన ఒక వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నాడనే విషయం తనకు తెలిసిందని బాబు ఆ లేఖలో బాబు రాసుకొచ్చారు! ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్‌ ఎగురవేశారని.. ములాఖత్‌ లో తనను కలిసిన వారి చిత్రాల కోసం డ్రోన్‌ ఎగురవేశారని.. తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని బాబు లేఖలో పేర్కొన్నారు!

ఇదే సమయంలో కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారని.. తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు ఆ గంజాయిని పట్టుకున్నారని బాబు రాసుకొచ్చారు. ఇదే సమయంలో జైల్లో ఉన్న 2200 మంది ఖైదీలలో 750 మంది తీవ్ర ఆరోపణలు ఉన్నవారు ఉన్నారని, ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయని చంద్రబాబు... న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఫైనల్ గా... ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి జైల్లో తనకు పూర్తిస్దాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు. ప్రస్తుతం ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.