Begin typing your search above and press return to search.

జనసేనలోకి వైసీపీ కీలక నేత!

చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ జనసేన పార్టీకి గట్టి నాయకులు లేరు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 9:30 AM GMT
జనసేనలోకి వైసీపీ కీలక నేత!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వానికి మంచి ఆదరణ లభించింది. ఏకంగా పది లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీంతో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదుకు గడువు మరింత పొడిగించారు. దీంతో మరింత మంది క్రియాశీలక సభ్యులుగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం కావడం, కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా ఉండటం.. ఈ శాఖల ద్వారా గ్రామాల్లో జనసేన పార్టీని క్షేత్ర స్థాయి వరకు బలంగా విస్తరించాలని నిర్ణయించుకోవడం వంటి కారణాలతో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ జనసేన పార్టీకి గట్టి నాయకులు లేరు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందనే యోచనలో పలువురు వైసీపీ నేతలు ఉన్నారని సమాచారం. దీంతో జనసేనలో చేరికకు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. వీరిలో పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఉన్నారని చెబుతున్నారు.

2019లో దొరబాబు వైసీపీ తరఫున పిఠాపురంలో గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్‌ ఆయనకు సీటు ఇవ్వలేదు. నాడు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో పవన్‌ పై పోటీకి దింపారు. అటు వంగా గీత, ఇటు పెండెం దొరబాబు కూడా పవన్‌ కళ్యాణ్‌ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

పెండెం దొరబాబు, వంగా గీతలకు తోడు ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో విజయానికి గట్టి ప్రయత్నం చేశారు, సాక్షాత్తూ నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు పిఠాపురంలోనే సభ నిర్వహించారు. ఇంత చేసినా పవన్‌ కళ్యాణ్‌ ఘనవిజయాన్ని ఆపలేకపోయారు.

2019 ఎన్నికల్లో గెలిచిన పెండెం దొరబాబుకు 2024 ఎన్నికలలో జగన్‌ సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. 2004లో తొలిసారి దొరబాబు బీజేపీ తరఫున పిఠాపురం నుంచి గెలిచారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి వైసీపీ తరఫున బరిలోకి దిగిన దొరబాబు గెలుపొందారు.

ఈ నేపథ్యంలో దొరబాబు జనసేనలో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ పై ఆయన తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. పిఠాపురం అభివృద్ధి పవన్‌ కళ్యాణ్‌ తోనే సాధ్యమన్నారు. తాను జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు అనుచరులకు కూడా దొరబాబు చెప్పినట్టు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో ఆయన జనసేనలో చేరతారని టాక్‌ నడుస్తోంది.