కంచుకోటలో సెగ... బాబు రియాక్షన్ లేకపోతే బ్లాస్టే..!
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెనమలూరులో రాజకీయ సెగలు కొనసాగుతున్నాయి.
By: Tupaki Desk | 18 Jan 2024 11:30 PM GMTఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెనమలూరులో రాజకీయ సెగలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ వ్యవహారం.. టీడీపీలో ముదిరి పాకాన పడుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి వైసీపీ టికెట్ నిరాకరించిన దరిమిలా.. ఆయన ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెప్పి న నేపథ్యంలో మరింతగా నియోజకవర్గం వేడెక్కింది. ఎందుకంటే.. కొలుసు చూపు ఇప్పుడు టీడీపీపైనే ఉంది. పైగా ఆయనను చేర్చుకునేందుకు టీడీపీ కూడా రెడీగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
అంతర్గత చర్చలు కూడా పూర్తయ్యాయని.. హైదరాబాద్‌లో రహస్య సమావేశాలు కూడా జరిగాయని.. కొలుసు చేరిక ఖాయమని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతున్నాయి. ప్రాథమికంగా.. నారా లోకేష్‌తో కొలుసు చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చేరిక ఇక లాంఛనమేనని అంటున్నాయి. రేపో మాపో.. కొలుసు టీడీపీ సైకిల్ ఎక్కనున్నారని అంటున్నాయి. ఇదే ఇప్పుడు పెనమలూరులో సెగలు పుట్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుకూల వర్గం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తోంది.
పార్టీ ఓడినప్పటికీ.. వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ.. బోయే ప్రసాద్ టీడీపీలోనే ఉన్నారని.. ఆయన వర్గం చెబుతోంది. అంతేకాదు.. చంద్రబాబు పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లోనూ బోడే పాల్గొన్నారని.. ఆయన చేసిన తప్పేంటని.. వారు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బోడే ప్రసాద్‌ను గెలిపించుకుని తీరుతామని కూడా నాయకులు చెబుతున్నారు. కొలుసుకు ఇక్కడ టికెట్ ఇస్తే.. సహించేది లేదని కూడా అంటున్నారు. నిన్న మొన్నటి వరకు బోడేకు వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా.. ఇదే మాట చెబుతుండ డం ఆశ్చర్యంగా ఉంది.
ఎందుకంటే.. బోడేను వ్యతిరేకించిన వర్గం కూడా.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో లబ్ది పొందిం ది. పనులు చేయించుకున్నారు. కేవలం 2019 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే విభేదాలు వచ్చాయి. కానీ,ఇప్పుడు టికెట్ చేజారుతుందన్న అంచనాలు వస్తుండడంతో బోడేకు వ్యతిరేకంగా ఉన్న వారు కూడా.. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మారారు. దీంతో నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఈ విషయంపై చంద్రబాబు జోక్యం చేసుకుని మంటలను చల్లార్చే ప్రయత్నం చేయకపోతే.. మరిన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.