వణికిస్తోన్న ఒక్క శాతం.. యూఎస్ ఎన్నికల్లో ఆ రాష్ట్రం ఎందుకు ప్రత్యేకం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో కీలక రాష్ట్రాలపై కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ లు ప్రత్యేక దృష్టి సారించారు
By: Tupaki Desk | 23 Oct 2024 3:52 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో కీలక రాష్ట్రాలపై కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ లు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా... ప్రెసిడెంట్ గా ఎన్నిక కావాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొల్పిన పెన్సిల్వేనియా రాష్ట్రంపైనే ఎక్కువగా డబ్బు, సమయం దారపోతున్నారని తెలుస్తోంది.
అవును... కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఇది డెమోక్రాట్ల కంచుకోటగా ఉంది. ఇక టెక్సాస్ లో 40 ఓట్లుండగా.. ఇక్కడ రిపబ్లికన్స్ బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. 19 ఎలక్ట్రోరల్ కాలెజ్ ఓట్లున్న పెన్సిల్వేనియాపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అభ్యర్థులు పెన్సిల్వేనియాపై దృష్టి సారించారు.
ఈ రాష్ట్రం ఎంత కీలకమో చెప్పే క్రమంలో ఇక్కడ గెలవకుండా 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటున్నారు రాజకీయ నిపుణులు. దీంతో ఇద్దరు అభ్యర్థుల దృష్టంతా ఇప్పుడు ఇక్కడే ఉందని అంటునారు. ట్రంప్ ఇటీవల మెక్ డొనాల్డ్ లో పని చేసింది కూడా ఈ రాష్ట్రంలోనే కావడం గమనార్హం.
ఈ రాష్ట్రంలోనే గత మూడు నెలల్లో రెండు పార్టీలకు చెందిన సుమారు 50 సభలు జరిగాయి. ఈ ఒక్క అంశం ఇక్కడున్న పోటీ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుందని భావించొచ్చు. ఇక్కడ సోమవారం నుంచి 21 మంది ప్రముఖులతో రిపబ్లికన్ పార్టీ బస్సు యాత్రను కూడా ప్రారంభించింది.
ఇలా ఈసారి జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి ఉన్న ఈ రాష్ట్రంలో ఫలితం మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠను కలిగిస్తుందని అంటున్నారు. దీంతో... ఇక్కడ సమయం మాత్రమే కాదు డబ్బు కూడా బలంగా ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఈ రెండు పార్టీలూ ఖర్చు చేసే ప్రతీ 4 డాలర్లలో ఒక డాలర్ ఇక్కడే ఖర్చు చేస్తున్నారు.
కాగా... ఈ ఎన్నికల్లో ఏడు కీలక రాష్ట్రాల్లోని ఓట్లపైనే ఇప్పూడు అందరి దృష్టీ కేంద్రీకృతమైందని అంటున్నారు. ఇందులో భాగంగా... పెన్సిల్వేనియా (19), జార్జియా (16), నార్త్ కరోలినా (16), మిషిగన్ (15), ఆరిజోనా (11), విస్కాన్సిన్ (10), నెవాడ (6) ఉన్నాయి.
ఇక.. 2016 ఎన్నికల్లో ట్రంప్ కేవలం 1 శాతం ఓట్లతో పెన్సిల్వేనియాలో విజయం సాధించి ప్రెసిడెంట్ అవ్వగా... అదే 1 శాతం ఓట్ల తేడాతో 2020లో ఈ రాష్ట్రాన్ని, పదవిని కోల్పోయారు. ఈ జూలైలో ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడిన రాష్ట్రం కూడా పెన్సిల్వేనియానే కావడం గమనార్హం.