పింఛన్ల ఇంటింటి పంపిణీ.. సాధ్యమా? కాదా?
ప్రస్తుతం ఏపీలో మరోసారి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా దుమారం రేపు తోంది
By: Tupaki Desk | 29 April 2024 8:35 AM GMTప్రస్తుతం ఏపీలో మరోసారి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా దుమారం రేపు తోంది. ఏప్రిల్ 1-10వ తేదీ వరకు కూడా.. ఇదే పద్ధతిపై వివాదం రేగింది. వలంటీర్లను ఇంటింటికీ పంపించి.. ఇస్తున్న పింఛన్ల వ్యవహారం.. వెనుక రాజకీయం ఉందని.. వలంటీర్లు ఓ చేత్తో పింఛన్లు ఇస్తూ.. మరో చేత్తో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్న ప్రతి పక్షాలు.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో సిటిజన్ ఫర్ డెమొక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఫలితంగా వలంటీర్లను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచాలని.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు దూరమయ్యారు. దరిమిలా.. ఏప్రిల్ 1న పంపిణీ కావాల్సిన ఇంఛన్ల వ్యవహారం.. తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇవ్వలేమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో సచివాలయాలు.. వద్ద ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది పెను వివాదా నికి.. రాజకీయ రగడకు దారి తీసింది. మొత్తానికి ఏదో ఒక విధంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగి సింది.
ఇక, ఇప్పుడు మే 1 రానుంది. ముందుగానే మేల్కొన్న ప్రతిపక్షం.. ఆసారి గ్రామ , వార్డు సచివాలయాల వద్ద కూడా కాకుండా.. నేరుగా పింఛను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని కోరింది. ఈ మేరకు వినతి పత్రాలు విరివిగా ఇచ్చింది. మొత్తానికి సర్కారు నుంచి తాజాగా సమాధానం వచ్చింది. అసలు ఇవేవీ కాకుండా.. పాత పద్ధతిలోనే తాము సంక్షేమ పథాల లబ్ధిని.. బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపింది. కేవలం నడవలేని.. మంచంలో తీసుకుంటున్నవారికే ఇళ్లకు పంపిణీ చేస్తామని పేర్కొంది.
ఇది.. గత నెల కన్నాకూడా.. వివాదంగా మారుతుందనేది టీడీపీ అంచనా. దీంతో చంద్రబాబు లైన్ లోకి వచ్చి.. సర్కారు అధికారుల తీరును ఎండగట్టారు. ఇంటింటికీ పంపిణీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నది ఆయన వాదన. సరే.. ఈ నేపథ్యంలో అసలు వలంటీర్లు లేకుండా.. పింఛన్లు ఇంటింటికీ పంపిణీ చేయడం సాధ్యమేనా? అనేది చర్చగా మారింది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. మిశ్రమ సమాధానమే వస్తుంది.
ఎందుకంటే.. దేశంలో ఎక్కడా కూడా పింఛన్లను కానీ, ప్రభుత్వ పథకాలను కానీ.. ఇంటింటికీ తీసుకువెళ్లి ఇస్తున్న ప్రభుత్వం లేదు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం సహా. ఇక, ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పర్మినెంట్ ఉద్యోగులకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వారు ఇంటింటికీ తిరిగేందుకు ఈ రూల్స్ ఒప్పుకోవు. వారు కూడా తిరగరు. కేవలం.. ఏదైనా ప్రత్యేక పనిపై అంటే.. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ.. జనాభా గణన సమయంలో వారిని ఇంటింటికీ తిప్పితే.. దానికి సంబంధించి వారికి ప్రత్యేకంగా సొమ్ము చెల్లిస్తారు.
మరీముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారిని ఫీల్డ్‌కు పంపించడం.. రూల్స్‌కు విరుద్ధం కూడా. సో.. ఇప్పుడు వారిని ఇంటింటికీ పంపించడం.. ఇది కూడా అధికారికంగా అయితే.. సాధ్యం కాదు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. ప్రభుత్వ అధికారులు ఇరుకున పడతారు. కాబట్టి.. దీనిపై ప్రతిపక్షాల గద్దింపులు పనికిరావు. అదేసమయంలో ఇంటింటికీ పంపించేందుకు ఉన్న ఏకైక మార్గం.. పోస్టల్ సౌకర్యం. ఈ విధానంలో ప్రభుత్వం కనుక ఒప్పందం చేసుకుంటే.. పోస్టు మ్యాన్‌ల ద్వారా.. నగదును పంపించవచ్చు.
అయితే.. దీనికి కూడా పోస్టల్ శాఖ చార్జీలను వసూలు చేస్తుంది. కానీ, ఇది న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేని వ్యవస్థ. కేవలం వలంటీర్లను నియమించుకున్నదే.. ఇంటింటికీ తిరగాలన్న షరతుతో కాబట్టి... వారు తప్ప.. ఇతర ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి చేసే అవకాశం లేదు. ఇక్కడ కూడా.. మరో లాజిక్ ఉంది. వారిని ఒప్పించి.. చేయించుకోవచ్చు. కానీ, ఇలా ఒప్పించడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి అవసరం లేదు. అందుకే.. మరోసారి పింఛన్ల పంపిణీ సంక్లిష్టమవుతోంది.