Begin typing your search above and press return to search.

బిగ్‌ బ్రేకింగ్‌.. వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం!

వైఎస్సార్‌సీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణపై హత్యాయత్నం జరిగింది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 10:06 AM GMT
బిగ్‌ బ్రేకింగ్‌.. వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం!
X

వైఎస్సార్‌సీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ కారుపై దుండగులు డిటోనేటర్‌ తో దాడి చేశారు. అయితే అది పేలకపోవటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది.

వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ్‌ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దుండగులు ఎలక్ట్రిక్‌ డిటోనేటర్‌ విసిరారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే శంకర నారాయణ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా గడ్డం తాండాకు వచ్చిన సందర్భంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ వాహనంపై ఓ ఆకతాయి డిటోనేటర్‌ విసరడం కలకలం రేపింది. అయితే, డిటోనేటర్‌ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న నాయకులు నిందితుడిని అదుపులోకి పోలీసులకు అప్పగించారు.

ఎమ్మెల్యే శంకర్‌ నారాయణపై ఎలక్ట్రికల్‌ డిటోనేటర్‌ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే దానికి పవర్‌ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్‌ విసిరినట్లు భావిస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు తెలిపారు. దుండగుడి పేరు గణేష్‌ గా గుర్తించామని వెల్లడించారు.

నిందితుడిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామమని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.

కాగా 2014లో పెనుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాలగుండ్ల శంకర నారాయణ ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ తొలి విడత మంత్రివర్గంలో శంకర్‌ నారాయణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జగన్‌ రెండో విడత మంత్రివర్గం విస్తరించినప్పుడు శంకర్‌ నారాయణను మంత్రి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా శంకర్‌ నారాయణ వ్యవహరిస్తున్నారు.