విశాఖలో పీవీ సింధు భూ వివాదం... అసలేం జరిగింది?
అవును... ఏపీ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు కేటాయించిన స్థలంపై వివాదం మొదలైంది.
By: Tupaki Desk | 30 Oct 2024 3:56 AM GMTబ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గత వైసీపీ ప్రభుత్వం 2021 జూన్ లో విశాఖపట్నం రురల్ మండలం చినగదిలిలో రెండు ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ 73/11, 83/5,6 సర్వే నెంబర్లలో ఉన్న పశుసంవర్థక శాఖకు చెందిన స్థలంలోని రెండు ఎకరాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఈ భూమిని ఇచ్చారు.
ఈ సర్వే నెంబర్లలో ఉన్న మొత్తం మూడెకరాల భూమిలో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదలాయించారు. ఈ నేపథ్యంలోనే క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు కేటాయించిన భూమిని పీవీ సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కేటాయించింది. అయితే ఇప్పుడు ఈ స్థలంపై వివాదం మొదలైంది.
అవును... ఏపీ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు కేటాయించిన స్థలంపై వివాదం మొదలైంది. వీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కోసం విశాఖలో కేటాయించిన స్థలంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా... ఈ స్థలంలో జూనియర్ కళాశాల నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు మొదలుపెట్టారు!
వాస్తవానికి గతంలోనే ఈ స్థలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చే శారు. అయితే.. తాజాగా మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ స్థలాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జూనియర్ కాలేజీకి కేటాయించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దింతో ఈ వ్యవహారంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.
కాగా.. 2021లో ఈ స్థలానికి సంబంధించి.. అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐటీ రిటర్న్స్ సమర్పించడంతోపాటుగా నిబంధనల ప్రకారం మిగిలిన కండిషన్స్ అన్నీ ఓకే అయిన తర్వాత పీవీ సింధు బ్యాండింటన్ అకాడమీకి ప్రభుత్వం ఈ స్థలాన్ని బదలాయించింది. దీంతో... అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు పీవీ సింధూ ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.