మూసీ ప్రాజెక్టుకు మరో దెబ్బ.. మరో కార్మికుడు గుండెపోటుతో మృతి
కలలు కనటం తప్పేం కాదు. ఆ కలలు కూడా ఎవరు కనని స్థాయిలో కలలు కనటం మంచిదే. వాటిని సాకారం చేసుకోవటం కోవటం శ్రమించటాన్ని తప్పు పట్టలేం.
By: Tupaki Desk | 3 Oct 2024 4:18 AM GMTకలలు కనటం తప్పేం కాదు. ఆ కలలు కూడా ఎవరు కనని స్థాయిలో కలలు కనటం మంచిదే. వాటిని సాకారం చేసుకోవటం కోవటం శ్రమించటాన్ని తప్పు పట్టలేం. కాకుంటే.. తమ కలల్ని సాకారం చేయటం కోసం ఒక క్రమపద్ధతిలో అడుగులు వేయకపోవటం కష్టం. అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మరింత కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కలిగే కష్టం సామాన్యుడి జీవితాన్ని ఆగమాగం చేస్తుంది. తాజాగా రేవంత్ సర్కారు చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఆ మాదిరే మారింది.
మూసీని బాగు చేయటం.. దానికి పూర్వవైభవాన్ని కల్పించేందుకు శ్రమించటం తప్పేం కాదు. అలా చేయటాన్ని అందరూ హర్షిస్తారు. కానీ.. ఆ పేరుతో వేలాది మందిని కొత్త కష్టంలో ముంచెత్తటం లాంటివి చేస్తేనే ఇబ్బంది అంతా. మూసీ ప్రక్షాళన కోసం వేలాది ఇళ్లను కూల్చేయాల్సిన పరిస్థితి. లేదంటే.. వారందరిని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాన్ని ఆచితూచి అన్నట్లు.. అడుగులు అడుగు వేసుకున్నట్లుగా వ్యవహరించాలి. కానీ.. దూకుడుగా.. తొందరపాటుతో వ్యవహరిస్తే మొదటికే మోసం కలుగుతుంది.
ఇప్పుడు అలాంటి ఇబ్బందే మూసీ పరివాహక ప్రాంతంలో ఏళ్లకు ఏళ్లుగా నివసిస్తున్న వేలాది మందికి కలుగుతోంది. తాజాగా మూసీ పరిధిలోని తన నివాసాన్ని కూల్చేస్తారన్న భయంతో హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాదం చోటు చేసుకుంది. అంబర్ పేట నియోజకవర్గం పరిధిలోని న్యూతులసీరాంనగర్ లంకకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు జి.కుమార్ కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు.
ఇటీవల రెవెన్యూ అధికారులు న్యూతులసీరాంనగర్ లంక బస్తీలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ఇళ్లను కూల్చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో.. ఉన్న ఒక్క ఇంటిని కూల్చేయటాన్ని జీర్ణించుకోలేని కుమార్ దిగులుకు లోనయ్యాడు. రెండు మూడు రోజులుగా తీవ్రమైన మనస్తాపానికి గురైన అతను.. బుధవారం తెల్లవారుజామున ఛాతీ నొప్పిగా ఉందంటూ ఇంట్లోని వారికి చెప్పటంతో హుటాహుటిన ఇంటికి తీసుకెళ్లారు. దారి మధ్యలోనే ఆయన గుండెపోటుతో మరణించటం స్థానికంగా విషాదంగా మారింది. అదే సమయంలో మూసీ సుందరీకరణలో భాగంగా అధికారుల అత్యుత్సాహం ప్రజలకు శాపంగా మారుతుందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనిస్తున్నారా?