బంగ్లాలో సంక్షోభం వేళ లంకలో కలకలం తిరిగొస్తున్న ఆ కుటుంబం
అయితే, లంకపై బలమైన పట్టున్న కుటుంబం కావడంతో రెండేళ్లలోనే పుంజుకుని తిరిగొస్తోంది.
By: Tupaki Desk | 7 Aug 2024 6:19 PM GMTసరిగ్గా రెండేళ్ల కిందట భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో ఏం జరిగిందో అందరూ చూశారు కదా..? అధ్యక్షుడిగా విపరీత అధికారం చెలాయించిన గొటబాయ రాజపక్సను ప్రజలు పారిపోయేలా చేశారు. ఆయన అధ్యక్ష భవనంలోకి చొరబడి చేతికందినది దోచుకుపోయారు. తామంతా దుర్భర దారిద్ర్యం అనుభవిస్తుంటే.. అధ్యక్షుడు విలాసంగా జీవిస్తున్నారనే ఆగ్రహంతో అధికారికి నివాసంపై దాడి చేశారు. చివరకు గొటబాయ దేశం విడిచి పారిపోయారు. శ్రీలంకలో గొటబాయ ఒక్కడే కాదు.. ఆయన కుటుంబం అంతా రాజకీయ పదవుల్లో ఉంది. ఓ దశలో ఆయన తర్వాత వీరిలో ఒకరి పేరే వినిపించింది. అయితే, లంకపై బలమైన పట్టున్న కుటుంబం కావడంతో రెండేళ్లలోనే పుంజుకుని తిరిగొస్తోంది.
లంకను పీల్చి పిప్పి చేసి..
ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న శ్రీలంకను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడమే గొటబాయ పాలన పర్యవసానం. దీంతో ప్రజాగ్రహానికి గురయ్యారు. 2022 ఏప్రిల్ మధ్యలో లంక అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. ప్రజలు అధ్యక్ష భవనం ఆక్రమించేశారు. గొటబాయ పరార్ తో ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే పదవిలోకి వచ్చారు. ఇప్పుడు లంకలో మళ్లీ అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. దీంతో గొటబాయ కుటుంబం వారసుడి పేరును ప్రకటించింది. ఎస్‌ఎల్‌పీపీ (శ్రీలంక పొదుజన పెరమున) పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్స పేరును ప్రతిపాదించారు. ఈయన ఎవరో కాదు.. శ్రీలంకకు పదేళ్లు అధ్యక్షుడిగా, మూడేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన మహీందా రాజపక్స కుమారుడు.
కాగా, ఎన్నికల ముంగిట ఎస్‌ఎల్‌పీపీకి చెందిన 100 మంది ఎంపీలు రాజపక్సకు మద్దతుగా నిలిచారు. దీంతోనే నమల్ పేరు బయటకు వచ్చిందట. తొలుత వ్యాపారి దమ్మిక పెరేరాను దించాలని భావించినా వ్యక్తిగత కారణాలతో విముఖత చూపారు. అప్పటికప్పుడు నమల్ పేరును ప్రకటించారు. కాగా, లంక అధ్యక్ష ఎన్నికల పోరు నలుగురి మధ్యనే ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు సజిత ప్రేమదాస, జీవీపీ నాయకుడు అరుణ కుమార దిశనాయకే మిగతా అభ్యర్ధులు.
బంగ్లా సంక్షోభం వేళ
లంకలో జరిగినట్లే తాజాగా బంగ్లాదేశ్ లోనూ ప్రధానిపై తిరుగుబాటు జరిగింది. గొటబాయలాగే హసీనా దేశం విడిచి పారిపోయారు. బంగ్లా ఘటనలను లంకతో పోల్చి చూశారు. ఇప్పుడు బంగ్లాలో సరిగ్గా అలాగే జరిగింది. అదే సమయంలో లంకలో గొటబాయ కుటుంబం తిరిగొస్తోంది.