Begin typing your search above and press return to search.

బాబుకు బిగ్ స‌వాల్‌: ఆర్థిక శాఖ‌పై శ్వేత ప‌త్రం.. నిపుణుల మాటిదే..!

అమరావతి ప్రాజెక్టును తీసుకుంటే కక్షగట్టి అమరావతిని తుంగలో తొక్కార‌ని చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   15 July 2024 2:17 AM GMT
బాబుకు బిగ్ స‌వాల్‌: ఆర్థిక శాఖ‌పై శ్వేత ప‌త్రం.. నిపుణుల మాటిదే..!
X

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఇప్పటికే మూడు శ్వేత పత్రాలు విడుదల చేశారు. వీటిలో ప్రధానంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని, అప్పులపాలు చేశారని, ఆయా ప్రాజెక్టులను ధ్వంసం చేశారని, వ్యవస్థలను ఖూనీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. వీటిలో పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు విడుదల చేశారు. పోలవరాన్ని తీసుకుంటే రివర్స్ టెండరింగ్ ద్వారా ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రాజెక్టును తీసుకుంటే కక్షగట్టి అమరావతిని తుంగలో తొక్కార‌ని చెప్పుకొచ్చారు.

ఇక విద్యుత్ రంగాన్ని తీసుకుంటే ఇందులో ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచార‌ని, ట్రూప్ అప్‌ చార్జీల రూపంలో 32 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని చంద్ర‌బాబు విమర్శలు చేశారు. ఉచితంగా వచ్చే విద్యుత్‌ను రాష్ట్రంలో ఉత్పత్తి చేయడం మానేసి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే లాగా.. తన వారికి మేలు చేసేలాగా వ్యవహరించి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఓకే ఇంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు మరో రంగంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. అదే ఆర్థిక శాఖ. ఈ శాఖకు సంబంధించి శ్వేత పత్రాన్ని మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

అయితే, మ‌రోవైపు.. దీనిపై చంద్రబాబు ఇప్పుడు వెనక‌డుగు వేస్తున్నారు స‌మాచారం. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు విడుదల చేసిన మూడు శ్వేత పత్రాలకు.. సాధారణ ప్రజలకు మధ్య సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక విద్యుత్ రంగంతో మాత్రమే సాధారణ ప్రజలకు సంబంధం ఉంది. మిగిలిన రెండు విషయాలను తీసుకుంటే పోలవరానికి సాధారణ ప్రజలకు సంబంధం లేదు. అది ప్రభుత్వాలు ప్రభుత్వాలకు మధ్య నిర్వహించాల్సిన ప్రాజెక్ట్. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? కేంద్ర ప్రభుత్వం కడుతుందా? అవి తేల్చుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి సాధారణ ప్రజలపై దాని ప్రభావం పెద్దగా పడకపోవచ్చు.

ఇక అమరావతి రాజధాని విషయాన్ని తీసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో వైసిపి విధానం మూడు రాజధానులు. కాబట్టి అమరావతి విషయం కూడా సాధారణ ప్రజలకు పెద్దగా పట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో దానికి అనుకూలంగానే తీర్పు ఇచ్చారు. చంద్రబాబు అమ‌రావ‌తి ప్రాజెక్టు కట్టిస్తారు అని ఒక ఆశతో ప్రజలంతా ఉన్నారు. కాబట్టి ఇది కూడా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. పెట్టుబడిదారులపై ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు వస్తే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అమరావతి పట్టాలెక్కుతుందని చాలామంది పెట్టుబడిదారు ఆశ‌లో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పెట్టుబడి పెట్టిన వారు వెనక్కి వచ్చేందుకు మళ్లీ నిర్మాణాలు చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక విద్యుత్ రంగానికి వస్తే సాధారణ ప్రజల్లో వైసిపి పట్ల వ్యతిరేకతను పెంచడంలో ఈ శ్వేత పత్రం ఉపయోగపడుతుంది. విద్యుత్తు చార్జీలు పెంచారంటూ గతంలోనే కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అదే విధంగా ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఎన్నికల్లో వైసిపిని 11 స్థానాలకే పరిమితం చేసింది. కాబట్టి ఈ విషయంలోనూ చంద్రబాబు నాయుడు ఒక రకంగా సక్సెస్ అయ్యారు. అంటే విద్యుత్ చార్జీలను వైసీపీ పెంచింది అని చెప్పడం ద్వారా ఆయన వైసీపీని మరింత డైల్యూట్ చేయగలిగారని చెప్పొచ్చు.

ఇక.. విడుదల చేయనున్న ఆర్థిక శాఖ పత్రం విషయానికి వస్తే మాత్రం.. ఇది విడుదల చేస్తే చంద్రబాబుకే పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బయటికి చెబితే పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు లేదా తమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భావిస్తూ పెట్టుబడులు తీసుకొచ్చేవారు కూడా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణలో స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి గత ఏడాది డిసెంబర్‌లో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ఆర్థిక శ్వేత పత్రం విడుదల చేశారు. ఆ తర్వాత అప్పటివరకు రావలసినటువంటి మూడు ప్రధాన కంపెనీలు వివిధ కారణాలు అని పేర్కొంటూ వెనక్కి వెళ్ళిపోయాయి.

దీనికి కారణం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోదు లేదని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి పర్యటించడమేనని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం విశేషం. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదన్న విషయం ఎదుటి వాళ్ళకి తెలిస్తే మన జోలికి రారు. పైగా మన నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే రేపు మాకేం సాయం చేస్తుంది అనే ఉద్దేశంతో పెట్టుబడిదారులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ‌ వేస్తారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఉన్న‌దే. ఉదాహరణకు బీహార్ తీసుకుంటే అక్కడ ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు.

కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే విషయం అందరికీ తెలుసు కాబట్టి. యూపీలో పెట్టుబడి పెట్టేందుకు ఇటీవల కాలంలో మాత్రమే వస్తున్నారు దీనికి కారణం కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందనే న‌మ్మ‌క‌మే. కానీ, ఏపీలోనే రాజకీయ ప్రత్యర్థులు కాకుండా.. రాజకీయ శత్రువులు ఉన్నారనేది పెద్ద మైనస్ గా మారింది. ఇప్పుడు ఆర్థికపత్రం విడుదల చేస్తే రాష్ట్ర ఖజానా జీరో అని తెలిస్తే.. వచ్చే పెట్టుబడిదారులు కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఆర్థిక శ్వేత పత్రం విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే వెనక్కి తగ్గాలని భావిస్తున్న‌ట్టు ఒక సమాచారం.

అయితే, దీనిపై క్లారిటీ లేదు. ఇది కాదని చంద్రబాబు గనుక ఆర్థిక శ్వేత‌పత్రం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టి.. ఇన్ని అప్పులు చేశారు.. అన్ని అప్పులు చేశారు.. ఇన్ని వడ్డీలు కట్టాలి.. ఇదంతా భారం అనేలా చెప్పుకొస్తే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాకపోగా రాష్ట్ర ప్రజలు కూడా ఇదేదో సంక్షేమ పథకాలను ఎగ్గొట్టడానికి చంద్రబాబు ఆడుతున్న ఒక నాటకం లాగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇది పార్టీకి కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వానికీ ఉంది. అందులో చంద్రబాబు వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆచితూచి వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.