Begin typing your search above and press return to search.

రాత్రంతా బస్సులో.. వరదలో చిక్కి.. కారులో కొట్టుకెళ్లి.. వర్ష విషాదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి.

By:  Tupaki Desk   |   1 Sep 2024 3:21 PM GMT
రాత్రంతా బస్సులో.. వరదలో చిక్కి.. కారులో కొట్టుకెళ్లి.. వర్ష విషాదాలు
X

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. శనివారం ఉదయం మొదలైన వరుణుడి ప్రతాపం.. ఆదివారం ఆసాంతం కొనసాగింది. మరీ ముఖ్యంగా శనివారం రాత్రి వేళ పలుచోట్ల ప్రమాద ఘటనల చోటుచేసుకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు బాగా ప్రభావితం అయ్యాయి. ఏపీతో ఈ జిల్లాలకు సరిహద్దులు తెగిపోయాయి. ఖమ్మం అయితే.. జల దిగ్బంధం అయింది. కాగా,

సూర్యాపేట జిల్లా కోదాడ రెండో రోజూ తేరుకోలేదు. ఇక్కడ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోదాడలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరదలో కొట్టుకుపోయాయి. కారులో ఓ మృతదేహం బయటపడింది. అతడిని రవిగా నిర్ధరించారు. ఇక శ్రీమన్నారాయణ కాలనీలో ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు శనివారం రాత్రి బైక్‌పై ఇంటికి వెళ్తూ వరదలో గల్లంతయ్యారు. ఆదివారం విగతజీవిగా కనిపించారు. కోదాడలో వరద డివైడర్ల పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో వాటిని పగులగొట్టి సహాయ చర్యలు చేపట్టారు. పెద్ద చెరువు మత్తడి దూకడంతో నయానగర్ జల దిగ్బంధమైంది. హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారిపై వరదతో రాకపోకలు నిలిచిపోయాయి.

చుట్టూ వరద.. రాత్రంతా బస్సులో

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో కొందరు రాత్రంతా బస్సులో వరద మధ్యన గడపాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులో వీరంతా శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌ వస్తండగా.. వర్షం మొదలైంది. బస్సు నిండుగా సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఉప్పొంగింది. ప్రయాణికులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బస్సులో నుంచే వీరంతా బంధువులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. వరంగల్ కలెక్టర్ గ్రామానికి వచ్చి.. ట్రాక్టర్‌ తో ప్రయాణికులను రక్షించారు.

ప్రతిభావంతురాలైన యువ సైంటిస్టు..

వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయి.. యువ మహిళా శాస్త్రవేత్త ప్రాణాలు కోల్పోయారు. కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని వరదలో చిక్కుకున్నారు. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ధాటికి కారు అదుపుతప్పి నీటిలోకి పోయింది. అయితే, తమ మెడవరకు నీరు వచ్చిందని.. కారు కూడా మునిగిపోయిందని వీరు బంధువులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫఓన్లు స్విచ్చాఫ్ వచ్చాయి. కారు కూడా కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం వీరిలో అశ్విని విగతజీవిగా కనిపించారు.