47...37...17...ఏంది ఈ స్కోరు ?
ఇంతకీ ఈ నంబర్ల వెనక ఏముంది అంటే చాలానే ఉంది అన్నదే కదా జవాబు. 47 అంటే బీఆర్ఎస్ కి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతం అన్న మాట.
By: Tupaki Desk | 5 Nov 2024 3:51 AM GMTఅవును కదూ ఇవేమి నంబర్లు ఈ మతలబు ఏంటి అంటే అదే కధా రాజకీయ తమాషా అని అనాల్సి ఉంటుంది. అంతే కాదు రాజకీయ కధ కూడా అందులో దాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా గులాబీ తోటలో పూచిన బీఆర్ఎస్ గురించే అని వేరేగా వివరించాల్సిన పని కూడా లేదు అంటున్నారు.
ఇంతకీ ఈ నంబర్ల వెనక ఏముంది అంటే చాలానే ఉంది అన్నదే కదా జవాబు. 47 అంటే బీఆర్ఎస్ కి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతం అన్న మాట. ప్రతీ వందలో 47 ఓట్లు బీఆర్ఎస్ కి ఆనాడు పడ్డాయి. అలా అద్భుతమైన విజయం నాడు బీఆర్ఎస్ దక్కించుకుని శభాష్ అనిపించుకుంది.
తీరా చూస్తే అయిదేళ్ల పాలనలో ఆ 47 శాతం ఓటు కాస్తా కరిగిపోయి 37 శాతానికి చేరింది. ఈ ముచ్చట అంతా 2023 లో జరిగిన ఎన్నికల్లో సాగింది. అంటే సరిగ్గా ఏడాది క్రితం గులాబీ తోటలో గుబులు రేపి గుండెల్లో విషాదాన్ని నిండా నింపిన ఎన్నికలు అన్న మాట.
ఇక 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరింతగా దిగజారి బీఆర్ఎస్ కి ఏకంగా 17 శాతం ఓటు లభించింది. అంటే కేవలం ఆరు నెలల తేడాలో ఇరవై శాతం ఓటు తగ్గిపోయింది అన్న మాట. అలా గులాబీ తోట వసివాడి రాజకీయంగా పసి కూన అయిపోయింది.
తెలంగాణాలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేక చతికిలపడింది. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసలు బయటకు రావడమే మానుకున్నారు అని అంటున్నారు.
ఇక బీఆర్ఎస్ ని నడిపించే భారం అంతా హరీష్ రావు కేటీఆర్ ల మీద పడింది. అయితే ఈ ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆ విధంగా ప్రచారం అయితే సాగుతోంది. అంతే కాదు కేసీఆర్ ముద్దుల తనయ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు అయిన కవిత కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు.
ఆ మీదట ఆమె బెయిల్ మీద బయటకు వచ్చినా అసలు బయటకు రావడమే లేదు. ఆమె పబ్లిక్ లో కనిపించి చాలా కాలం అయింది అని అంటున్నారు. బీఆర్ఎస్ లో నేపధ్యం అంతా ఇలా ఉంది. ఈ అయోమయ పరిస్థితుల్లో ఈ గందరగోళంలో కేటీఆర్ అయితే తాను తెలంగాణా అంతా పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు.
ఆ విధంగా రాష్ట్రమంతా తిరిగి బీఆర్ ఎస్ కి తానే అసలైన అధినేతను అని ఫోకస్ చేసుకోవడంతో పాటు రేపటి రోజున బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా తానే అని ప్రొజెక్ట్ చేసుకోవడానికే కేటీఆర్ వేసిన ఎత్తుగడ ఇది అని అంటున్నారు. అది పసిగట్టిన హరీష్ రావు టీం కి ఇవన్నీ అసలు నచ్చడం లేదు అని అంటున్నారు.
ఇక బీఆర్ఎస్ కి మూలమైన అస్తిత్వంగా ఉన్న తెలంగాణా సెంటిమెంట్ పోయింది.దానిని కేసీఆర్ తానుగానే వదిలేశారు అని అంటున్నారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ని ఒక లెవెల్ లోకి తీసుకుని వచ్చేస్తున్నామన్న భ్రమలలో ఉన్నది కాస్తా లేకుండా చేసుకున్నారు అని అనాడే అనుకున్నారు.
ఆ విధంగా బీఆర్ఎస్ ఎటూ కాకుండా ఉంది. కేసీఆర్ మళ్లీ తెలంగాణా సెంటిమెంట్ ని రగిలించలేని విధంగా పరిస్థితి ఉంది. ఈ విధంగా దిగాలుగా దిక్కులు చూస్తూ ఉన్న బీఆర్ఎస్ కోలుకోవడానికి ఏడాది సమయం కూడా చాలడం లేదు అని కళ్ల ముందు పరిస్థితి చూపిస్తోంది.
అయితే కేటీఆర్ మాత్రం అంతా అయిపోయినట్లే ఇక పాదయాత్రతో అధికారం అందుకోవడమే ఇక మిగిలింది అన్నట్లుగా ఆర్భాటాలు చేస్తున్నారు అని అంటున్నారు. బీఆర్ ఎస్ అయినా దాని పూర్వానామం టీఆర్ ఎస్ అయినా తెలంగాణావే ఊపిరి. అదే ఆ పార్టీకి జీవం. అలాంటిది ప్రాణాధారం అన్నది ఇపుడు లేకుండా పోయింది.
మరో వైపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆటోమేటిక్ గా అభివృద్ధి వైపే ప్రజల దృష్టి ఉంది. అంతే కాకుండా ఉపాధి కోసం కూడా జనాలు చూస్తున్నారు. ఆ దిశగా ఆలోచనలు చేయాల్సిన చోట మళ్లీ తెలంగాణా వాదాన్ని తెచ్చినా గతంలో మాదిరిగా వర్కౌట్ అయ్యే చాన్స్ లేదని అంటున్నారు.
కేసీఆర్ ఉజ్వల ప్రభ అన్నది 2001 నుంచి 2018 దాకా ఒక వెలుగు వెలిగింది. ఆ టైం లో ఆయన ఏమి అన్నా శాసనంగా మారింది. అయితే ఆ తరువాత రాజకీయం మొత్తం మారింది. దానికి అంచనా వేయడంలో విఫలం కావడం వల్లనే బీఆర్ఎస్ ఇపుడు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మౌనం దాల్చారు అంటే అందులో ఎన్ని అర్థాలు అయినా వెతకవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ ఏడాదికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేసిందని తమదే అధికారం ఇక అనుకుంటే మాత్రం రివర్స్ గేర్ వేస్తున్నట్లే అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు.