Begin typing your search above and press return to search.

కర్నూల్ లో హైకోర్టు బెంచ్... చోటు చేసుకున్న కీలక పరిణామం!

ఈ క్రమంలో... వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.. రహదారులు-భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 5:05 AM GMT
కర్నూల్  లో హైకోర్టు బెంచ్... చోటు చేసుకున్న కీలక పరిణామం!
X

ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన మరో హామీ నెరవేరబోతోంది! ఇందులో భాగంగా... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది! కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. బెంచ్ ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం.. ఆ తర్వాత అసెంబ్లీలోను తీర్మానం చేయడం తెలిసిందే. ఈ సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరాం.. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు లేఖ రాశారు.

ఈ క్రమంలో... వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.. రహదారులు-భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు. ఈ సందర్భంగా... హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ / ప్రైవేటు భవనాలు ఉన్నాయా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు.

ఈ సమయంలో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, లాయర్ల వసతి, కోర్టు సిబ్బంది నివాస సౌకర్యాలు మొదలైన వాటికోసం అవసరమైన భవనాల కోసం ఉన్నతాధికారులు విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర శివారులోని భవనాన్ని పరిశీలించారని అంటున్నారు.

కర్నూలు నగర శివారులోని దిన్నెదేవరపాడులో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నూతన భవనాన్ని అధికారులు అత్యాధునికంగా సుమారు రూ.25 కోట్లతో నిర్మించారు. ఇందులో కోర్టు అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు, స్పెషల్ రూములు అందుబాటులో ఉన్నాయి. దీనికి అనుబంధంగా నాలుగు సూట్ రూములతో గెస్ట్ హౌస్ ఉంది.

అయితే... ఇక్కడ 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలు లేవు. దీంతోపాటు బి. తాండ్రపాడులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో, సిల్వర్ జూబ్లీ కాలేజ్ క్యాంపస్ లోని క్లస్టర్ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఖాళీగా ఉన్న 50 గదులను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే అన్నీ అనుకూలంగా జరిగితే వీలైనంత తొందరలోనే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని అంటున్నారు. దీంతో... ఎన్నికల ముందు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కూటమి పార్టీలు ఇచ్చిన మరో కీలక హామీ నేరవేరబోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.