Begin typing your search above and press return to search.

వెంటాడుతున్న బియ్యం కేసు అజ్ఞాతంలోనే పేర్ని జయసుధ

మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 1:06 PM GMT
వెంటాడుతున్న బియ్యం కేసు అజ్ఞాతంలోనే పేర్ని జయసుధ
X

మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితమే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రమ్మంటూ ఈ నెల 22న పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీచేశారు. అప్పటికే పేర్ని కుటుంబం ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో గోడలకు నోటీసులు అంటించారు. దీనిపై సోమవారం స్పందించిన జిల్లా ఎస్పీ గంగాధర్ విచారణకు రావాల్సిందిగా పేర్ని జయసుధకు మరోసారి నోటీలిస్తామని చెప్పారు.

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ అద్దెకిచ్చిన గొడౌన్లో రేషన్ బియ్యం మాయమైనట్లు మచిలీపట్నం పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. అయితే కేసు నమోదైన వెంటనే బియ్యం విలువను చెబితే డబ్బు చెల్లిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని పౌర సరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు. రూ.1.70 కోట్లు విలువైన రెండు చెక్కులను అందజేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం చర్యలకు సిద్ధమవడంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి పేర్ని నాని బయటకు వచ్చి ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేసినా, అవి ఫలించకపోవడంతో కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పేర్ని కుటుంబానికి కొంత మంది అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తుండటం, పేర్నిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు పట్టుబడుతుండటంతో ఈ వ్యవహారం రాష్ట్రరాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ కేసుపై రకరకాల అనుమానాలు తలెత్తుతుండటంతో తాజాగా ఎస్పీ గంగాధర్ మీడియా ముందుకు వచ్చారు. కేసులో ఇప్పటికే ఒకసారి నోటీసిచ్చామని, నిందితులు చూడకపోయి ఉండొచ్చని చెప్పారు. మరోసారి నోటీసులిస్తామని, తమ పనితీరుపై ఎవరూ సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో పేర్ని కుటుంబాన్ని కూటమి ప్రభుత్వ తేలిగ్గా వదిలేలా లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా, అప్పట్లో మంత్రిగా ఉన్న పేర్ని నాని టీడీపీ, జనసేనలను టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేసేవారు. వైసీపీ అధినేత జగన్ ను చిన్న మాట అన్నా సహించేవారు కాదు. అదే సమయంలో మచిలీపట్నంలో తన రాజకీయ ప్రత్యర్థి, నేటి మంత్రి కొల్లు రవీంద్రతో తీవ్ర వైరం కొనసాగించేవారు. వీటి ఫలితంగానే రేషన్ మాయం కేసులో దొరికిన పేర్నిని కార్నర్ చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని టాక్.