Begin typing your search above and press return to search.

'కాకినాడ పోర్టులో గబ్బర్ సింగ్ – 3'... పేర్ని పంచులు, బొత్స సెటైర్లు!

కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను అభినందిస్తూనే సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 10:17 AM GMT
కాకినాడ పోర్టులో గబ్బర్  సింగ్ – 3... పేర్ని పంచులు, బొత్స సెటైర్లు!
X

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్టెల్లా షిప్ ను "సీజ్ ది షిప్" అని అధికారులను ఆదేశించారు.

అది ఎంతవరకూ జరుగుతుంది.. ప్రాక్టికల్ గా అది సాధ్యమేనా.. అనే వ్యవహారంపై తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి అలా ఉంటే.. కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను అభినందిస్తూనే సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. ఈ విషయం వైరల్ గా మారుతోంది!

అవును... కాకినాడ పొర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన తనిఖీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా తాను పోర్టులోకి వెళ్లడానికి తనకు అధికారులు అనుమతులు ఇవ్వలేదంటూ పవన్ వ్యాఖ్యలను పేర్ని నాని ప్రస్థావించారు.

ఈ సందర్భంగా.. పోర్టులోకి వెళ్లడానికి పీఎం కి అయినా, సీఎం, డిప్యూటీ సీఎంకి అయినా అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు (పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి) ఇద్దరూ పవన్ వెళ్లిన బోటులోనే ఉన్నారని.. అధికారులు ఇద్దరూ అక్కడే ఉండగా తనకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పంటం ఏమిటి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

ఇదే సమయంలో.. కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు ఓ మంచి ప్రయత్నంగా అభివర్ణించిన పేర్ని నాని.. ఈ ప్రయత్నాన్ని అంతా అభినందించాలని అన్నారు. అయితే... ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. షిప్ లోకి ముందు రోజు కలెక్టర్ కు అనుమతులు ఇచ్చిన అధికారులు ఇద్దరూ పవన్ తోనే ఉంటే.. తనకు అనుమతులు లేవని పవన్ చెప్పడం ఏమిటంటూ ప్రశ్నించారు.

అంటే.. పవన్ ను షిప్ ఎక్కొద్దని సీఎం చంద్రబాబు చెప్పి అయినా ఉండాలి.. లేకపోతే పవన్ అబద్ధం అయినా చెప్పి ఉండలి అంటూ పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. అనుమతివ్వాల్సిన అధికారులు ఇద్దరినీ పక్కనే పెట్టుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో... పవన్ సీజ్ చేయమని చెప్పిన షిప్ పక్కనే మరో షిప్ ఉందని.. దాన్ని మాత్రం పవన్ సీజ్ చేయమని ఎందుకు చెప్పలేందంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... స్టెల్లా షిప్ ను సీజ్ చేయమని పవన్ అంటున్నారని.. అయితే, అక్కడే ఉన్న కెన్ స్టార్ అనే మరో షిప్ కూడా ఉందని.. దాన్ని సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇది నిజంగా పవన్ సీరియస్ ప్రయత్నమా.. లేక, ఏదో జరుగుతుంటే.. మరేదో చూపించి జగన్ పై బురద జల్లే కార్యక్రమమా అని పేర్ని నాని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో... బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ డ్రామా ఆడుతున్నారా..? అంటూ ఘాటుగా ప్రశ్నించిన పేర్ని నాని... స్టెల్లా షిప్ పక్కనే ఉన్న కెన్ స్టార్ షిప్ యజమాని ఆర్థిక మంత్రి వియ్యంకుడిది కాబట్టి దాని జోలికి వెళ్లలేదా అని నిలదీశారు! అందుకే పవన్ కళ్లకు గంతలు కట్టుకొని కెన్ స్టార్ జోలికి వెళ్లలేదా అని ప్రశ్నించారు.

ఆర్థిక మంత్రి వియ్యంకుడు ఒక్కడే 42 వేల టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారని స్టెల్లా షిప్ లో ఎగుమతి చేసుకుంటున్నవారు ఆరోపిస్తున్నారన్నట్లుగా పేర్ని నాని సంచలన విషయాలు వెల్లడించారు. పవన్, కలెక్టర్ సదరు కెన్ స్టార్ షిప్ మీదుగా కూడా వెళ్లాలని సూచిస్తూ.. ఆ షిప్ మీదకు వెళ్లొద్దని పవన్ కి చంద్రబాబు చెప్పారా అనే విషయంపై పవన్, చంద్రబాబు సమాధానం చేప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

కాకినాడ పోర్టులో గబ్బర్ సింగ్ - 3!:

పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాకినాడ పోర్టులో పవన్ యాక్షన్, గబ్బర్ సింగ్ - 3 చూశామని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పొర్టులో రెడ్డి ఉంటే మాకెందుకు, కమ్మ ఉంటే మాకెందుకు.. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు అంటూ బొత్స చురకలు అంటించారు!

ఇదే సమయంలో... ఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా అని పవన్ అడుగుతున్నారని.. మరి పక్కనే ఉన్న మీ మంత్రి (నాదెండ్ల మనోహర్) మాటేంటి.. ఆయన చేతకానివాడా.. అంటూ బొత్స ప్రశ్నించారు. పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండని అన్నారు!