బియ్యం మాయం కేసు A6 పేర్ని నాని
ఇప్పటికే ఈ కేసులో పేర్ని సతీమణి జయసుధ A1గా అభియోగాలు ఎదుర్కొంటుండగా, ఈ కేసుతో సంబంధం ఉందని పేర్ని నానినీ నిందితుల జాబితాలో చేర్చారు.
By: Tupaki Desk | 31 Dec 2024 7:15 AM GMTమచిలీపట్నంలో రేషన్ బియ్యం దారి మళ్లిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పేర్ని సతీమణి జయసుధ A1గా అభియోగాలు ఎదుర్కొంటుండగా, ఈ కేసుతో సంబంధం ఉందని పేర్ని నానినీ నిందితుల జాబితాలో చేర్చారు.
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) A6 నిందితుడిగా మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులుగా గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జయసుధకు బెయిల్ వచ్చిన మరునాడే ఆమె భర్తను నిందితుల జాబితాలో చేర్చడం గమనార్హం.
పేర్ని జయసుధ పేరిట ఉన్న గొడౌన్లో రేషన్ బియ్యం మాయమయ్యాయని పౌరసరఫరాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 378 టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించి రూ.3.37 కోట్ల జరిమానా విధించారు. అంతేకాకుండా పేదల బియ్యం అక్రమంగా తరలించినందుకు గాను క్రిమినల్ కేసు నమోదు చేశారు. అధికారుల ఆదేశాల ప్రకారం తొలుత 187 టన్నుల బియ్యానికి రూ.1.70 కోట్లను రెండువిడతలుగా పేర్ని నాని చెల్లించారు. తాజాగా రూ.1.67 కోట్లు చెల్లించాల్సిందిగా అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. ఇదే సమయంలో పేర్ని నానిని కూడా నిందితుల జాబితాలో చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులు అరెస్టు అయ్యారు. గిడ్డంగి మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి, డ్రైవర్ బోట్ల మంగరాజు, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మేర ట్రాంజక్షన్ జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు చిక్కుముడి ఛేదించడం పోలీసులకు తేలకైందని అంటున్నారు. అంతేకాకుండా మానస్ తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని కుటుంబ సభ్యులకు లక్షల రూపాయల్లో డబ్బు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ఈ డబ్బు లావాదేవీలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారని అంటున్నారు.