అండర్ గ్రౌండ్ లోకి పేర్ని నాని ఫ్యామిలీ?
విషయం ఏదైనా.. తనదైన వ్యాఖ్యలతో మీడియాలో ప్రముఖంగా కనిపించే మాజీ మంత్రి పేర్ని నాని.. ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు.
By: Tupaki Desk | 14 Dec 2024 4:13 AM GMTవిషయం ఏదైనా.. తనదైన వ్యాఖ్యలతో మీడియాలో ప్రముఖంగా కనిపించే మాజీ మంత్రి పేర్ని నాని.. ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఆ మాటకు వస్తే ఆయన ఫ్యామిలీ ఆచూకీ ఎక్కడన్నది ప్రశ్నగా మారింది. ఆయన సొంత గోదాముల్లోని రేషన్ బియ్యం మాయమైన కేసు నేపథ్యంలో ఆయన కుటుంబం మొత్తం అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. పేర్ని నాని రోటీన్ కు భిన్నమైన వార్తల్లో వ్యక్తిగా మారారు. విషయం ఏదైనా.. మిగిలిన వైసీపీ నేతల కంటే ముందుగా మీడియా మైకుల ముందుకు వచ్చి.. నాన్ స్టాప్ గా మాట్లాడే ఆయన.. ఇప్పుడు కనిపించకపోవటం హాట్ టాపిక్ గా మారింది.
రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన సతీమణి జయసుధపై కేసు నమోదు కావటం.. ఈ నేపథ్యంలో శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం ఒక ఎత్తు కాగా.. పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎక్కడా కనిపించకపోవటంతో వారంతా అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. ఇంతకూ ఈ ఇష్యూ ఏమిటి? పేర్ని నాని లాంటి పెద్ద నేత.. తన కుటుంబ సభ్యులందరిని తీసుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లేంత సీరియస్ నేరం ఏం జరిగింది? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. పలు అంశాలు వెలుగు చూస్తాయి.
పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో పౌరసరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాము అద్దెకు ఇచ్చారు. ఇందులో నిల్వ ఉంచిన 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమైంది. దీంతో.. పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. గోదాము యజమానురాలిగా ఉన్న పేర్ని నాని సతీమణితో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజ్ పై మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వారి అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది.
ఇలాంటి వేళలోనే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణ నిమిత్తం జిల్లా జడ్జి అరుణ సారిక.. తొమ్మిదో అదనపు జిల్లా కోర్టుకు పిటిషన్ ను బదిలీ చేశారు. సదరు న్యాయాధికారి సుజాత కేసును ఈ నెల 16కువాయిదా వేశారు. ఈ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున ఏసీపీగా ఉన్న లాయర్ పేర్ని నానికి సన్నిహితుడిగా చెబుతున్నారు. ఆయన్ను వైసీపీ హయాంలో నియమించారని.. అందుకే ప్రత్యేక ఏపీపీని నియమించాలన్న డిమాండ్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
పేర్ని నాని గోదాములో మాయమైన 185 టన్నుల బియ్యం వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అసలు మాయమైన బియ్యం లెక్కేంటి? అన్నది అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తి అయితే..మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి పేర్ని నాని హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఈ ప్రోగ్రాంకు ఆయన కానీ.. ఆయన కొడుకు పేర్ని కిట్టు (వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్) కానీ కనిపించలేదు. దీంతో.. వారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఉంటారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.