Begin typing your search above and press return to search.

చెల్లెళ్ళకు ఆస్తులు పంచావా చంద్రబాబూ ?

దాని మీద చంద్రబాబు చేసిన విమర్శల నేపధ్యంలో కౌంటర్ ఇవ్వడానికి మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 5:22 PM GMT
చెల్లెళ్ళకు ఆస్తులు పంచావా చంద్రబాబూ ?
X

వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీదకు వెళ్ళింది. దానికి కారణం ఏపీలో వైఎస్ జగన్ ఆయన చెల్లెలు షర్మిల మధ్య మొదలైన ఆస్తుల వివాదం టీడీపీ అధికార ట్విట్టర్ లో వచ్చింది. దాని మీద చంద్రబాబు చేసిన విమర్శల నేపధ్యంలో కౌంటర్ ఇవ్వడానికి మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు.

ఆయన చంద్రబాబునే సూటిగా ప్రశ్నిస్తూ మీకూ ముగ్గురు అప్పచెల్లెళ్ళు ఉన్నారు కదా. మీరు కష్టార్జితంలో లేక మామ గారిని వెన్నుపోటు పొడిచి సంపాదించుకున్న ఆస్తులు మీ రాజకీయ జీవితం మొత్తంలో అధికారం అనుభవించి పోగు చేసుకున్న ఆస్తులో ఏవైనా కానీ అందులో నుంచి ఎపుడైనా మీ తోబుట్టువులకు వాటా ఇచ్చిన చరిత్ర ఉందా అని నిలదీశారు. ఉంటే దానిని ఆధారసహితంగా బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

పొరుగింట్లో గొడవ అయితే పక్కన ప్రహారీ గోడ మీద నుంచి చెవులు రిక్కించి విని ఆనందించే మనస్తత్వం చంద్రబాబుది అన్నారు. జగన్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉంటే అది వారి సొంత సమస్య అని అన్నారు. అది ఏమైనా రాష్ట్ర సమస్యా అని ప్రశ్నించారు. దానికి ఏపీ ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అని కూడా నిలదీశారు. ఏపీలో అత్యాచారాలు జరుగుతుంటే. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే వాటి మీద దృష్టి పెట్టాల్సిన బాబు జగన్ ఆస్తుల వివాదమే పెద్ద సమస్య అయినట్లుగా వ్యవహరించడమేంటి అని ఆయన ప్రశ్నించారు.

జగన్ తన స్వార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల నుంచి చెల్లెలుకు 2019లో అవగాహన ఒప్పందం ద్వారా ఇవ్వాలని అనుకున్నారని అవి వేల కోట్ల రూపాయల ఆస్తులు అని అన్నారు. ఈడీ అటాచ్ లో ఉండబట్టి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన వివరించారు.

అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరస్వతి పవర్ ప్రాజెక్టులో డైరెక్టర్లను మార్చేసి విజయమ్మ దగ్గర ఉన్న మొత్తం షేర్లను షర్మిల బదలాయింపు చేయించుకున్నారని ఆయన అన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుదని జగన్ బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని అందుకే జగన్ తనకు తెలియకుండా ఈ బదలాయింపులు జరగడం మీద కోర్టుకు వెళ్లారని ఆయన వివరించారు. ఇది తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఇంత జరుగుతున్నా జగన్ మిన్నకుండి బెయిల్ రద్దు చేయించుకుని జైలుకు పోవాలా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాక కూడా పెళ్ళి కాక ముదురు బ్రహ్మచారిగా ఉంటే ఎన్టీఆర్ ఆయనకు తన కుమార్తెని ఇచ్చి పెళ్ళి చేసారని పేర్ని నాని సెటైర్లు వేశారు.

దానికి బదులుగా బాబు సొంత మామనే వెన్ను పోటు పొడిచి అధికారంతో పాటు ఆస్తులు అన్నీ దక్కించుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ హైదరాబాద్ లో కట్టించిన ఆఫీసు, గండిపేట స్థలాలు, ఎన్టీఆర్ కట్టించిన ఆసుపత్రి ఇలా అన్నీ తీసుకున్న బాబు అందులో నుంచి కొంత అయినా తన చెల్లెళ్ళకు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.

ఆఖరుకి తన సొంత తల్లి అమ్మణమ్మ హైదారాబాద్ లో వందల కోట్ల విలువ చేసే అయిదు ఎకరాల భూమిని నారా లోకేష్ కి గిఫ్ట్ గా ఇస్తే మిగిలిన మనవళ్లకు కూడా అందులో పంచమని చంద్రబాబు ఏనాడైనా సుద్దులు చెప్పారా అని పేర్ని నాని ప్రశ్నించారు. బాబు చెప్పేవి మాత్రమే శ్రీరంగ నీతులు అని అన్నారు. మొత్తం మీద జగన్ ఆస్తుల విషయంలో షర్మిలకు వత్తాసుగా బాబు మాట్లాడడం బట్టే తెలుస్తోంది ఈ రాజకీయం వెనక ఎవరు ఉన్నారో అని అంటూ పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు.