Begin typing your search above and press return to search.

దటీజ్ పేర్ని.. వైసీపీలో నువ్వు స్పెషల్ నాని

కానీ, ఇప్పుడు మిగతా నేతలను కాదని పేర్నికి బాధ్యతలు అప్పగించడం వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 7:30 PM GMT
దటీజ్ పేర్ని.. వైసీపీలో నువ్వు స్పెషల్ నాని
X

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి ఆ పార్టీలో మంచి గుర్తింపు దక్కిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా ఆయనకు అవకాశం ఇవ్వడం వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటివరకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లుగా కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన ఓ సామాజికవర్గం నేతలే ఉండేవారు. కేవలం సీనియర్ నేత బొత్సకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కేది. కానీ, ఇప్పుడు మిగతా నేతలను కాదని పేర్నికి బాధ్యతలు అప్పగించడం వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మచిలీపట్నం బియ్యం అక్రమ తరలింపులో అభియోగాలు ఎదుర్కొంటున్న పేర్ని నాని ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. గతంలో అధినేత జగన్ విషయంలో ఏ విమర్శ వచ్చినా పేర్ని తనపై వేసుకుని ప్రత్యర్థులతో పోరాడే వారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా పేర్ని జోరు వైసీపీ క్యాడర్ లో జోష్ తెచ్చేది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలో చాలా మంది సీనియర్లపై కేసులు నమోదయ్యాయి. తొలుత ఈ కేసుల విషయంలో పేర్ని భయపడకుండా పోరాడినా, ఆ తర్వాత తన కుటుంబంపైనా అభియోగాలు నమోదవ్వడంతో నీరుగారిపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ప్రోత్సహించేలా వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ప్రభుత్వ చర్యలపై పేర్ని ఎలా వ్యవహరించినా, ఆయన సేవలను గుర్తించామని చెప్పుకునేలా అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారంటున్నారు. పార్టీకి ఎంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలు పేర్నికి అప్పగించడం ద్వారా ఆయన సేవలు ఎంతటి విలువైనవో చెప్పారంటున్నారు. ఈ నియామకం అటు ఉత్తరాంధ్ర పార్టీ క్యాడరుతోపాటు ఇటు డెల్టాలోని పార్టీ బలోపేతానికి పనికొస్తుందని విశ్లేషిస్తున్నారు.

సహజంగా వైసీపీలో రీజనర్లు కో-ఆర్డినేటర్లు అంటే కొంతమంది పేర్లే వినిపిస్తుంటాయి. ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారే ప్రాంతాల వారీగా అధినేతకు కేడర్ కు మధ్య వారధిలా పనిచేసేవారు. ఉత్తరాంధ్రలో ఒకసారి సీనియర్ నేత బొత్సకు ఆ అవకాశం ఇచ్చారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్సకు రీజనల్ కోఆర్డినేటర్ పదవి పెద్ద గొప్పవిషయం కాదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో అధినేతకు బాగా సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటివారిని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించే అవకాశం ఉన్నా జగన్ మాత్రం ఈ సారి పేర్ని వైపు మొగ్గు చూపడం విశేషమంటున్నారు.

కాపు సామాజికవర్గంలో సమర్థుడైన నేతగా పేర్ని నానికి గుర్తింపు ఉంది. రాజకీయంగా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించగలరని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి కాపు సామాజికవర్గానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందనే టాక్ నడుస్తోంది. ఆ పార్టీలో కాపు నేతలు అంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. సామినేని ఉదయభాను, ఆళ్ల నాని, గ్రంథి శ్రీనివాస్, కిలారి రోశయ్య ఇలా చాలా మంది కాపు నేతలు వైసీపీని వదిలేశారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని వంటి నేతలను ప్రోత్సహించి దూరమవుతున్న ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవడం కూడా వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. ఏదిఏమైనా ఉత్తరాంధ్ర కోఆర్డినేటరుగా బాధ్యతలు చేపట్టబోతున్న పేర్ని వైసీపీలో ఓ స్పెషల్ లీడరుగా గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు.