ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తూ వైసీపీ సంచలనం
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అప్రజస్వామిక పాలన సాగిస్తోందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
By: Tupaki Desk | 7 Nov 2024 11:35 AM GMTఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్నారని అధికార కూటమి ప్రభుత్వం మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అప్రజస్వామిక పాలన సాగిస్తోందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
గుంటూరు, క్రిష్ణా, అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రెండు చోట్లా వైసీపీ అభ్యర్థులు పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికలను న్యాయబద్ధంగా నిర్వహించే పరిస్థితి అయితే లేదని ఆయన అన్నారు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా గాలికి వదిలేసింది అని పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఎన్ని ఘాతుకాలు చేసినా పోలీసులు వారిని ఏమీ చేయడం లేదని పేర్ని నాని ఆరోపించారు.
అదే సమయంలో వైసీపీ నేతలను పట్టుకుని పూర్తి స్థాయిలో వేధిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఈ కారణంగానే తాము ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పేర్ని నాని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని ఆరోపిస్తూ కేసులు పెడుతున్నారని వారిని అరెస్ట్ చేస్తూ పోలీసు స్టేషన్ల వెంబడి తిప్పుతున్నారని పేర్ని నాని విమర్శించారు.
ఇదిలా ఉంటే క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు ఉన్నాయి. వీటికి అభ్యర్థులను కూడా టీడీపీ కూటమి ప్రకటించింది. ఈ రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్ధులే పోటీలో ఉన్నారు. జనసేన బీజేపీ నుంచి మద్దతు ఉంది.
మరో వైపు చూస్తే పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించే కార్యక్రమం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. చాలా రోజులుగా అదే పనిలో టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు క్రిష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత గౌతం రెడ్డిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు అని ప్రచారం సాగింది.
దాంతో పాటు నాలుగైదు నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉందని కూడా వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చలేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేవు అన్న చర్చను సైతం జనంలో పెడుతున్నారు.
దీంతో కచ్చితంగా వైసీపీ పోటీ చేస్తే గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఇప్పటిదాకా అంటూ వచ్చారు. పైగా బ్యాలెట్ మీద జరిగే ఎన్నికలు ఇవి. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ఇపుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలను సైతం బహిష్కరించడం అంటే వైసీపీ చేస్తున్నది ఏమిటి అన్న చర్చ ఉంది.
అయితే బయటకు ఎంత చెబుతున్నా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఇంకా ఏమీ పెద్దగా లేదని అంటున్నారు. పైగా అర్ధబలం అంగబలం అధికార బలం ఉన్న కూటమి వైపే ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయని కూడా వైసీపీ భావిస్తోంది. వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి దిగేందుకు కూడా అంత సుముఖంగా ఎవరూ లేరని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను ఆలోచించిన మీదట పోటీలో ఉండి ఓటమి పాలు కావడం కంటే దూరంగా ఉండడం బెటర్ అన్న వ్యూహాత్మక వైఖరినే వైసీపీ ఎంచుకుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే 2021లో వైసీపీ అధికారంలో ఉన్నపుడు జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అప్పటి ప్రతిపక్షం అయిన టీడీపీ బహిష్కరించింది. అపుడు కూడా టీడీపీ అప్రజాస్వామికం అని వైసీపీ మీద నిందలు వేసింది. ఇపుడు కూడా అదే తీరున వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తోంది. అంతా సేం టూ సేం. ఇది రాజకీయ వ్యూహమే తప్ప మరోటి కాదని అంతా అంటున్నారు.