పేర్ని కోలుకోవడం కష్టమేనా..?
కూటమి సర్కారుపై నిప్పులు చెరిగిన పేర్ని.. ఇప్పుడు ఐపు, అజా లేకుండా పోయారు.
By: Tupaki Desk | 27 Dec 2024 6:08 AM GMTపేర్ని నాని.. రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు వైసీపీ మౌత్ పీస్‌గా మారి.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి.. కూటమి సర్కారుపై నిప్పులు చెరిగిన పేర్ని.. ఇప్పుడు ఐపు, అజా లేకుండా పోయారు. తన సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కావడం.. దీనికి సంబంధించి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆయన సొమ్ములు చెల్లించడం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కూడా పేర్ని ఎక్కడా మీడియా ముందుకు రాలేదు.
సీఐడీ అధికారులు దీనిపై కేసు నమోదు చేసిన విషయం.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహ ర్ ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకోవడంతో పేర్నికి ఇప్పుడు దారులు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు.. వాళ్లు అవినీతి చేశారు. వీళ్లు బెల్టు షాపులు పెట్టారు.. అంటూ.. పేర్ని హడావుడి చేశారు. అయితే.. తన మెడకే ఇంత పెద్ద ఉచ్చు చిక్కుకుంటుందని ఆయన ఊహించ లేకపోయారు. దీంతో పేర్ని రాజకీయంగా డైల్యూట్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో తన వారుగా ఉన్న కొందరు అధికారులను కూడా నాదెండ్ల తప్పించారు. ఇది మరింతగా పేర్నికి మైనస్ అయింది. ఈ పరిణామాలకు తోడు.. వైసీపీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. పైగా.. ఇప్పటి వరకు పేర్నిని పలకరించిన వారు ఉన్నారే తప్ప.. ఈ విషయంలో ఎవరూ ఆయనకు దన్నుగా నిలిచిన వారు కనిపించలేదు. ఇదిలావుంటే.. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన.. కొడాలి నాని విషయంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
పేర్ని వ్యవహారంలో కొడాలి పాత్ర ఉందన్న సమాచారం మేరకు.. ఆదిశగా కూడా అడుగులు వేస్తున్నారు. పేర్ని ద్వారానే కొడాలి నాని పాత్రను వెలుగులోకి తీసుకువచ్చి.. ఆదిశగా చర్యలు తీసుకునేలా వ్యూహా త్మకంగా అడుగులు పడుతున్నాయి. దీంతో పేర్ని మరింత సైలెంట్ అయ్యారా? కొడాలి పేరు చెబితే.. ఈ కేసు మరింత పెరుగుతుందని ఆయన ఆలోచన చేస్తున్నారా? అనేది కూడా చర్చకు దారితీసింది. కానీ, సర్కారు మాత్రం పేర్నిని వదిలేలా కనిపించడం లేదు. రేపో మాపో.. జయసుధను అరెస్టు చేసిన ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.