Begin typing your search above and press return to search.

పేర్ని జయసుధ సుదీర్ఘ విచారణ రేషన్ బియ్యం మాయంపై కూపీలాగిన పోలీసులు

మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 3:36 AM GMT
పేర్ని జయసుధ సుదీర్ఘ విచారణ రేషన్ బియ్యం మాయంపై కూపీలాగిన పోలీసులు
X

మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జయసుధను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న జయసుధపై మచిలీపట్నం కోర్టు డిసెంబర్ 30న బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు వెళ్లాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరైన పేర్ని జయసుధను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.

పీడీఎస్ బియ్యం మాయం కేసులో మచిలీపట్నం పోలీసులు ప్రధాన నిందితురాలు పేర్ని జయసుధను సుదీర్ఘంగా విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా పలు ప్రశ్నలు వేసిన పోలీసులు, జయసుధ వాంగ్మూలం నమోదు చేశారు. తన పేరుతో ఉన్న గిడ్డంగిలో బియ్యం మాయమైన విషయం తెలుసా? తెలిస్తే ఎప్పుడు తెలిసింది? అన్న ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. అయితే ఈ కేసులో ఆమె పాత్ర నామమాత్రమేనని భావిస్తున్న పోలీసులు.. ఇతర నిందితుల పాత్రపై జయసుధ నుంచి సమాచారం సేకరించారు.

పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లలో సుమారు 387 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్లు అధికారులు గత నెలలో గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఆరుగురు నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో మాజీ మంత్రి పేర్ని నాని ఏ6 కాగా, ఆయన సతీమణి ఏ1. మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, నానికి అరెస్టు నుంచి కోర్టు రక్షణ కల్పించింది.

దీంతో ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మచిలీపట్నం ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే తనపై కేసు నమోదు చేసినట్లు మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి కొల్లు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నానిని నిందితుల జాబితాలో చేర్చిన పోలీసులు ఆయన అరెస్టుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నానికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు సస్పెన్ష్ గా మారింది. మరోవైపు నాని భార్య జయసుధ పోలీసులకిచ్చిన వాంగ్మూలంపై ఉత్కంఠ నెలకొంది.

ఆమె పట్ల చాలా గౌరవంగా నడుచుకుంటున్న పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నట్లు చెబుతున్నారు. సుమారు 3 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత జయసుధను ఇంటికి పంపిన పోలీసులు మళ్లీ పిలిచినప్పుడు మళ్లీ విచారణకు రావాలని సూచించారు.