ఈసారి బాబుకు తోడు బండిని చేర్చిన పేర్ని నాని!
అవును... ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీ ని కలిసిన అనంతరం టీడీపీపైనా, బండి సంజయ్ పైనా మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 6 Sep 2023 4:16 AM GMTఏపీ వైసీపీ నేతల్లో ప్రత్యర్థులకు స్మూత్ వార్నింగ్ లు ఇస్తూ.. ఘాటు పదాలను కూడా తనదైన వ్యంగ్యంతో వదిలే నేతగా పేరున్న పేర్ని నాని తాజాగా మరోసారి మైకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
అవును... ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీ ని కలిసిన అనంతరం టీడీపీపైనా, బండి సంజయ్ పైనా మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణలను పేర్ని నాని తప్పు పట్టారు. ఉత్తరభారతదేశంలో బీజేపీ చేసినట్లు అందరూ చేస్తారనుకుంటే పొరపాటని హితవు పలికారు.
పక్క రాష్ట్రంలో పదవి పోయినవాడు ఒకడు వచ్చి ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై మాట్లాడుతున్నాడు అంటూ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పేర్ని నాని. ఉత్తర భారతంలో బీజేపీ చేసినట్లుగా ఇక్కడ వైసీపీ కూడా చేస్తుందని అనుకుంటే పొరపాటని హితవుపలికారు. ఇలా ఏదిబడితే అది మాట్లాడతున్నాడనే ఎన్నికల వేళ అన్నీ ఊడిపోయాయని అన్నారు.
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక బాధ్యతల్లో ఉన్న బండి సంజయ్... ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఒక్కో నియోజకవర్గానికి వేల వేళ దొంగఓట్లు జోడిస్తున్నారని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో... తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై పేర్ని నాని ఈ తరహా రిప్లై ఇచ్చారు.
ఇదే సమయంలో టిడిపి చేసిన పాపాల వల్ల ఇప్పుడు ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారని ఆరోపించిన పేర్ని నాని... ఓటర్ల జాబితా విషయంలో పాపాలు చేసింది చంద్రబాబునేనని అన్నారు. దొంగ ఓటర్లను చేర్చి గెలవాలనుకునే ఆలోచన చంద్రబాబుకు మాత్రమే వస్తుందని.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడని నానీ మండిపడ్డారు!
కాగా... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో వైసీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్లు లేకుండా, ఇన్ వాలీడ్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.