Begin typing your search above and press return to search.

ఈ నానీల బాధ వర్ణణాతీతం!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Jun 2024 1:00 PM GMT
ఈ నానీల బాధ వర్ణణాతీతం!
X

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం కవ్వింపు చర్యలకు దిగుతూ దాడులు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బూతులతో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ లపై విరుచుకుపడ్డ కొడాలి నానిని టీడీపీ శ్రేణులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో నాలుగు పర్యాయాలు.. రెండుసార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ నుంచి గెలుపొందిన నాని ఐదోసారి చిత్తయ్యారు.

మరోవైపు బందరు నుంచి పేర్ని నాని పోటీ చేయకుండా తన తనయుడు పేర్ని కిట్టును వైసీపీ నుంచి బరిలో దించారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసేవారిలో పేర్ని నాని ఒకరు. చివరకు తన సొంత కులాన్ని కూడా నిందించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి.

ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు టీడీపీ, జనసేన శ్రేణులు వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, కొడాలి నాని టీడీపీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు వైసీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లపైకి రాళ్లు రువ్వడం, కార్లు ధ్వంసం చేయడం, ఇళ్లను ధ్వంసం చేయడం చేస్తున్నారని పేర్ని నాని, కొడాలి నాని ఆరోపించారు. అంతేకాకుండా భౌతికంగా కూడా తమ పార్టీకి చెందినవారిపై దాడులు చేస్తున్నారన్నారు. ఇళ్లల్లోకి చొరబడి కొడుతున్నారని వాపోయారు.

పోలీసులు ఉన్నా, వారి సమక్షంలోనే దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్ని నాని, కొడాలి నాని ఆరోపించారు. పోలీసులకు ఫోన్‌ చేసినా పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులు చేసినా కేసులు కట్టడం లేదని వాపోయారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టవద్దని పోలీసులను చంద్రబాబు ఆదేశించారని ఆరోపించారు. టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే చూస్తూ ఉండాలే తప్ప అడ్డుకోవద్దని పోలీసులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని పేర్ని నాని, కొడాలి నాని విమర్శించారు. సీసీ పుటేజ్, వీడియో సాక్ష్యాలు ఉన్నా పోలీసులు స్పందించడం లేదన్నారు.

వైసీపీ శ్రేణులు ఎవరూ భయపడొద్దని.. తాము అండగా ఉంటామని తెలిపారు. పోలీసులపై, టీడీపీ నేతలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు దాఖలు చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఎస్పీని కలిసి దాడులకు సంబంధించిన ఆధారాలు అందజేస్తామన్నారు. అలాగే టీడీపీ, జనసేన శ్రేణుల దాడుల్లో గాయపడ్డవారిని స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామని భరోసా ఇచ్చారు.

కాగా ఈ ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి, పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మచిలీపట్నం నుంచి ఓటమి పాలయ్యారు.