Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఐటీ నోటీసులు... పేర్ని నాని స్మూత్ సెటైర్స్!

చంద్రబాబు, లోకేష్ లపై తనదైన శైలిలో స్పందించారు.. లోకేష్ స్పందనను కోరారు.. ప్రతిస్పందించాలని డిమాండ్ చేశారు!

By:  Tupaki Desk   |   1 Sep 2023 12:34 PM GMT
చంద్రబాబుకు ఐటీ నోటీసులు... పేర్ని నాని స్మూత్  సెటైర్స్!
X

చంద్రబాబుకు ఐటీ నోటీసుల జారీకి సంబంధించి హిందూస్తాన్‌ టైమ్స్‌ కథనం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఇప్పటి వరకూ చంద్రబాబు, లోకేష్ ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోయినా... వైసీపీ నేతలు మాత్రం వాయించి వదిలే పనికి పూనుకున్నారు!

అవును... చంద్రబాబుకు ఐటీ నోటీసుల కథనం విషయంలో చంద్రబాబు, లోకేష్ ల నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా రాని సంగతి తెలిసిందే! ఈ సమయంలో తాజాగా పేర్ని నాని మైకులముందుకు వచ్చారు. చంద్రబాబు, లోకేష్ లపై తనదైన శైలిలో స్పందించారు.. లోకేష్ స్పందనను కోరారు.. ప్రతిస్పందించాలని డిమాండ్ చేశారు!

తాజాగా ఈ విషయంపై స్పందించిన పేర్ని నాని... చంద్రబాబు ఇప్పటివరకు తిన్న దానిలో దొరికింది 118 కోట్ల రూపాయలు మాత్రమేనని.. దొరక్కుండా ఎంత తిన్నాడనే విషయం త్వరలో బయటికి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని చంద్రబాబు దారుణంగా దోచుకున్నాడని ధ్వజమెత్తారు

ఇంత భారీ స్థాయిలో హిందుస్తాన్‌ టైమ్స్‌ కథనం ఇస్తే... దానిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన పేర్ని నాని... చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టిందని అన్నారు. అమరావతి రాజధాని పేరుతో దోపిడీ జరిగిందనే విషయాన్ని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలే ఇప్పుడు వాస్తవాలుగా మారుతున్నాయని అన్నారు!

ఇదే సమయంలో... గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తప్పుడు ప్రచారం చేసే మీడియా సంస్థలు.. చంద్రబాబు ఐటీ నోటీసులపై వచ్చిన కథనాలపై ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు. ప్రధానులు, రాష్ట్రపతులను మార్చిన చంద్రబాబు స్థాయి వ్యక్తులకు ఐటీ నోటీసులిస్తే రాయాలిగా అని ప్రశ్నించారు!

ఇదే ఫ్లోలో... చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని డిమాండ్ చేసిన పేర్ని నాని... చినబాబు లోకేష్ కు కూడా ఒక డిమాండ్ తో కూడిన సూచన చేశారు. ఇందులో భాగంగా... లోకేష్ పాదయాత్ర కాసేపు ఆపి, తన తండ్రి అవినీతిపై మాట్లాడాలని సూచించిన ఆయన... హిందుస్తాన్‌ టైమ్స్‌ పై దావా వేసే దమ్ముందా? అని ప్రశ్నించారు!

ఇదే సమయంలో తాజాగా "భవిష్యత్తుకు గ్యారెంటీ తనది ష్యూరిటీ" అంటూ కొత్త మోసం మొదలుపెట్టిన చంద్రబాబు.. తన కుమారుడితో కలిసి ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారని దుయ్యబట్టారు పేర్ని నాని. మరోసారి ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబుని వెంటాడుతుందని చెప్పిన పేర్ని నాని... అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబుని, ఒకసారి గతానికి వెళ్తే ఎన్నో విషయాలు కనిపిస్తాయని.. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో దిట్ట అని.. ఘాటు వ్యాఖ్యలు చేశారు!

కాగా... ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చంద్రబాబుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందంటూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ సంచలనాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్మాణ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాల నేపథ్యంలోనే ఐటీ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు ఆ కథనం తెలిపింది!

అయితే ఇంత సంచలనాత్మక కథనంపై ఇప్పటివరకూ చంద్రబాబు, లోకేష్ లతో పాటు టీడీపీ నేతలు కానీ, వారి అనుకూల మీడియా కానీ స్పందించలేదని.. తేలుకుట్టినట్లు ఉండొద్దంటూ తాజాగా పేర్ని నాని ఇలా స్పందించారు!