Begin typing your search above and press return to search.

బెంగళూరులో కాగితాలు ఏరుకునే వ్యక్తికి 30 లక్షల డాలర్లు దొరికాయి!

అవును... బెంగళూరులోని ఒక రైల్వే స్టేషన్ పరిశరాల్లో చెత్త ఏరుకుంటున్నాడు. రోజూ వెళ్లినట్లే చెత్త ఏరుకుంటున్నాడు. ఈ సమయంలో పెద్ద బ్యాగ్ కనిపించింది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:51 AM GMT
బెంగళూరులో కాగితాలు ఏరుకునే  వ్యక్తికి 30 లక్షల డాలర్లు దొరికాయి!
X

కొంతమంది డబ్బు కోసం పరుగెడుతుంటే... కొంతమంది దగ్గరకు డబ్బే పరిగెత్తుకుని వస్తుందని అంటుంటారు. వాళ్లనే కోటీశ్వరులు అని చెబుతుంటారు! ఈ క్రమంలో తాజాగా చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక చెత్తకుప్పలో ఒక బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే షాక్ తగిలింది! కారణం... ఆ బ్యాక్ నిండా డాలర్ల కట్టలు ఉన్నాయి. వాటి మొత్తం ఒకటి రెండు కాదు... సుమారు 30 లక్షల డాలర్లు!

అవును... బెంగళూరులోని ఒక రైల్వే స్టేషన్ పరిశరాల్లో చెత్త ఏరుకుంటున్నాడు. రోజూ వెళ్లినట్లే చెత్త ఏరుకుంటున్నాడు. ఈ సమయంలో పెద్ద బ్యాగ్ కనిపించింది. ఏమిటా అని చూస్తే కళ్లు బైర్లు కమ్మినంత పనైందంట. ఆ బ్యాగ్ నిండా కరెన్సీ కట్టలు! అయితే అవి ఇండియన్ కరెన్సీ కట్టలు కాదు... డాలర్ల కట్టలు! వాటి విలువ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 25 కోట్లు ఉంటుందట!

వివరాళ్లోకి వెళ్తే... ఈ నెల 3వ తేదీన బెంగళూరులోని నాగవర రైల్వేస్టేషన్‌ దగ్గర పట్టాల పక్కన... పశ్చిమ బెంగాల్‌ లోని నాడియాకు చెందిన సాల్మన్‌ అనే వ్యక్తి చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్‌ నేషన్స్‌ అనే ముద్ర ఉంది. దీంతో ఆ సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం దాన్ని తెరిచి చూస్తే.. అందులో డాలర్ల బండిల్లు కనిపించాయి. అవి మొత్తం 23 అని చెబుతున్నాడు!

దీంతో అంత భారీ స్థాయిలో డాలర్ల కట్టలు కనిపించేసరికి ఏం చేయాలో తెలియక గుజరీ వ్యాపారికి ఫోన్ లో ఈ విషయం చెప్పాడట. అయితే... తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరుకు వచ్చేవరకు మీ వద్ద పెట్టుకోవాలని సూచించాడట ఆ వ్యాపారి. దీంతో బాగా భయపడ్డ సాల్మన్‌.. రెండురోజుల తర్వాత స్వరాజ్‌ ఇండియా సామాజిక కార్యకర్త కలీముల్లాను కలిసి విషయం చెప్పాడట.

దీంతో... విషయం గ్రహించిన కలీముల్లా.. ఈ సంగతిని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానందకు తెలిపారు. అనంతరం ఆ నగదును, సాల్మన్‌ ను తీసుకుని పోలీస్ కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లారు. ఇదే సమయంలో నగదు దొరికిన ప్రదేశాన్ని పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ ఇంకా నగదు ఏమైనా ఉందా.. మరేమైనా విలువైన.. లేదా, ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయా లేదా అని వెతికారంట!

ఈ సమయంలో తనిఖీ కోసం ఆ డాలర్లను సిటీలోని రిజర్వు బ్యాంకు బ్రాంచ్ కి పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆర్థిక నేరాల విభాగానికి చెందినదై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితె "ఈ బ్యాగులో విషపూరితమైన రసాయనాలు ఉన్నాయి.. తెరిచేటప్పుడు జాగ్రత్త" అని ఒక పెద్ద లెటర్‌ అందులో ఉండటం గమనార్హం.