Begin typing your search above and press return to search.

రియల్ స్టోరీ... నడి సముద్రంలో ఒంటరిగా 95 రోజులు!

పదంటే పది రోజుల చేపల వేటకు అని బయలుదేరాడు కాస్ట్రో.. అయితే, తుఫాను అతడి దారిని మళ్లించింది..

By:  Tupaki Desk   |   17 March 2025 2:00 PM IST
రియల్ స్టోరీ... నడి సముద్రంలో ఒంటరిగా 95 రోజులు!
X

ప్రపంచంలోనే అతి పెద్దదైన సముద్రం.. ఎటు చూసినా నీళ్లు.. నేల చూసే అవకాశం లేదు.. రోజు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఆహారం లేదు.. మంచి నీరు లేదు.. కానీ, బ్రతకాలన్న ఆశ ఉంది. అదే ఓ వ్యక్తిని 95 రోజుల తర్వాత ఒడ్డుకు చేర్చింది. ఇది, పెరూవియన్ మాక్సిమో నాపా కాస్ట్రో అనే పెరూ మత్స్యకారుడి రియల్ స్టోరీ.

అవును... పదంటే పది రోజుల చేపల వేటకు అని బయలుదేరాడు కాస్ట్రో.. అయితే, తుఫాను అతడి దారిని మళ్లించింది.. ఫలితంగా, ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. ఈ సమయంలో 95 రోజుల తర్వాత గస్తీ బృందానికి దొరికాడు. పునర్జన్మనెత్తాడు!

వివరాళ్లోకి వెళ్తే... పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో నాపా కాస్ట్రో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. పది రోజుల నుంచి రెండు వారాల ట్రిప్ ఇది. ఆ మేరకు ఆహారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో సుమారు 10 రోజుల తర్వాత సడన్ గా వచ్చిన తుఫాను.. అతన్ని పడవను పసిఫిక్ మహా సముద్రంలో దారి మళ్లించింది.

దీంతో... అతని కుటుంబ సభ్యులు, పెరూ సముద్ర గస్తీ దళాలు.. మాక్సిమో కోసం వెదకడం మొదలుపెట్టాయి. మరోపక్క... పసిఫిక్ మహా సముద్రంలో చిక్కుకుపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అతడి ఆలోచనలన్నీ... కుటుంబం, తల్లి, మనవరాలి గురించే నడుస్తున్నాయి.

ఈ సమయంలో తెచ్చుకున్న ఆహారం, తాగు నీరు మొత్తం ఖర్చైపోయాయి. దీంతో.. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు.. తాబేళ్లు, పక్షులను తిన్నాడు. అయితే... ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకాలనే పట్టుదలతో మక్సిమో ఉన్నారు. ఇదే సమయంలో.. మూడు నెలలు గడిచినా అతని కుటుంబం కూడా అతనిపై ఆశలు వదులుకోలేదు!

ఈ నేపథ్యంలోనే మార్చి 11న ఈక్వడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొంది. ఆ సమయంలో తీరానికి 1,094 కి.మీ. దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను గస్తీ బృందం రక్షించింది. వెంటనే ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం తాజాగా మాక్సిమోను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రియల్ స్టోరీ వైరల్ గా మారింది.