చంద్రబాబు ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో క్వాష్ పిటిషన్
తాజాగా హైకోర్టులో చంద్రబాబు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
By: Tupaki Desk | 12 Sep 2023 10:33 AM GMTటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ వ్యవహారంపై ఈరోజు కీలక తీర్పు వెలువడే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు అయిన విజయవాడ ఏసీబీ కోర్టు ఆ వ్యవహారంపై ఏ తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వడివడిగా పావులు కదుపుతున్నారు.
చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తాజాగా హైకోర్టులో చంద్రబాబు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
రాజకీయ కక్షతోనే ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలోని ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండానే ఆయనను అరెస్ట్ చేశారని, 2022లోనే చంద్రబాబు పేరు బయటకు వచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
కానీ, కక్షపూరితంగా 2023 సెప్టెంబర్ 8న ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇక రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని, ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా చేసినవని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని, అందుకు ఎఫ్ఐఆర్ క్వాష్ చేసేందుకు గ్రౌండ్స్ ను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్వాష్ పిటిషన్ పై కూడా హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఓవైపు లంచ్ మోషన్ పిటిషన్ మరోవైపు క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టులో తప్పకుండా చంద్రబాబుకు ఊరట లభిస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.